
బాల్యానికి భరోసా
● ముగిసిన ఆపరేషన్ ముస్కాన్ – 11 ● 193 మంది చిన్నారుల గుర్తింపు
గోదావరిఖని: బడికి వెళ్లాల్సిన వయసులో బాలకార్మికులుగా పనులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటివారిని గుర్తించి, సంరక్షించేందుకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టింది. ఈక్రమంలోనే ఈసారి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ –11తో సత్ఫలితాలు సాధించింది. జిల్లావ్యాప్తంగా నెలరోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 193 మంది చిన్నారులను గుర్తించి బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించింది.
రెండు జిల్లాలు.. 193 మంది చిన్నారులు..
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుర్తించిన మొత్తం 193 మంది చిన్నారుల్లో 71 మంది మంచిర్యాల, 122 మంది పెద్దపల్లి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇందులో 21మంది బాలకార్మికులు ఉన్నారు. నిరాశ్రయులైన పిల్లలు, బాలకార్మికులు, భిక్షాటనలో చిక్కుకు పోయిన వారికోసం గత జూలై ఒకటి నుంచి 31వ తేదీ వరకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంలో ఓ ఏసీపీకి బాధ్యతలు అప్పగించారు. సబ్ డివిజన్‌కు ఒక ఎస్సై చొప్పున ఐదుగురిని నియమించారు.
ఆధునిక సాంకేతికతతో..
ఆపరేషన్ ముస్కాన్ కోసం ఈసారి సరికొత్త సాంకేతికతను వినియోగించారు. దర్పన్ అనే ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించారు. ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కూలీలుగా పనిచేస్తున్న వారి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటుకబట్టీలు, హోటళ్లు, షాపులు, మెకానిక్ షెడ్లు తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్న బాలకార్మికులనూ గుర్తించి బడిలో చేర్పించారు. చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్‌ప్రొటెక్షన్, హెల్త్‌డిపార్ట్‌మెంట్ల అధికారులు, సిబ్బందితో స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు, షాపులు, మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీలు తదితర ప్రదేశాల్లో తనిఖీలు చేస్తూ చిన్నారులను గుర్తించి బాల్యానికి భరోసా కల్పించారు.
2017 నుంచి ఇప్పటిదాకా పోలీసులు గుర్తించిన చిన్నారులు
ఏడాది బాలురు బాలికలు మొత్తం
2017 206 48 254
2018 88 04 92
2019 116 39 155
2020 66 05 71
2021 88 13 101
2022 21 11 32
2023 33 04 37
2024 56 14 70
2025 136 57 193
‘ముస్కాన్ –11’లో గుర్తించిన పిల్లలు
బాలురు 136 బాలికలు 57 విముక్తి పొందిన చిన్నారులు 193
నమోదైన కేసులు 180
ప్రణాళిక పక్కాగా అమలు చేశాం
బాలకార్మిక వ్యవస్థ నుంచి చిన్నారులకు విముక్తి కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 విజయవంతమైంది. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక్కో సబ్ డివిజన్‌కు ఒక ఎస్సైని నియమించి ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు చేశాం. బయట తిరుగుతున్న వారిని గుర్తించి స్కూళ్లలో చేర్పించాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక అమలు చేశాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం

బాల్యానికి భరోసా