
డ్రామాలకు తెరతీస్తున్న బీఆర్‌ఎస్
గోదావరిఖని: ప్రాజెక్టుల పే రిట కమీషన్లు దండుకున్న బీఆర్‌ఎస్ నాయకులు.. పాత డ్రామాలకు తెరలేపుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చిన పాపానపోలేదన్నారు. స్థానిక తిలక్‌నగర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్యాం సేఫ్టీ కమిటీ నిపుణులు ప్రాజెక్టును పరిశీలించి నివేదిక ఇచ్చారని, అందులో నీటిని నిల్వచేస్తే ప్రాజెక్టు కూలిపోతుందని తేల్చి చెప్పారన్నారు. సుందిళ్ల, అన్నారం, కన్నెపల్లి బరాజ్‌ల నుంచి పంటలకు చుక్కనీరు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయి గత ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు. కన్నెపల్లి వద్ద మాజీమంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం పేరిట జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తోందని అన్నారు. కన్నెపల్లి గేట్లు బద్ధలు కొడతామంటూ కమలహాసన్ డైలాగులు చెప్పడం దేనికి సూచిక అని విమర్శించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేశ్, బొమ్మక రాజేశ్, కల్యాణి సింహాచలం, ధూళికట్ట సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేదు
అందుకే ఆ పార్టీని తిరస్కరించారు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్