
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర
● ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వకనే పంటలు ఎండుతున్నయ్ ● వచ్చే ఎన్నికల్లో ఓటుతోనే గుణపాఠం చెప్పాలి ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఆ ప్రాజెక్టులోని నీరంతా వృథాగా పోతోందని, ఇక్కడేమో సాగునీరందక, వానలు కురవక పంటలు ఎండుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. మాజీమంత్రి హరీశ్‌రావు మంగళవారం చేపట్టిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను బీఆర్‌ఎస్ జిల్లా భవన్‌లో ఎల్‌ఈడీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆ కార్యక్రమాన్ని తిలకించారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న దురాలోచనతోనే కాంగ్రెస్ నాయకులు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరుకంటి చందర్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కోపంతోనే రైతులు సాగుచేసే పంటలకు నీరు ఇవ్వకుండా గోదావరి జలాలను వృథా చేస్తున్నారని పుట్ట మధుకర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను మాజీమంత్రి హరీశ్‌రావు ఆధారాలతో సహా వివరిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. రెండు పిల్లర్లు కుంగితే వాటికి తాత్కాలిక మరమ్మతులు చేసి నీళ్లను ఆపాల్సిందిపోయి రైతులను అవస్థల పాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలకులు కుమ్మకై ్క పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. నాయకులు కౌశిక హరి, గంట రాములు, రఘువీర్‌సింగ్, ఉప్పు రాజ్ కుమార్, గోపు ఐలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.