చదవాలి.. రాయాలి | - | Sakshi
Sakshi News home page

చదవాలి.. రాయాలి

Aug 5 2025 8:45 AM | Updated on Aug 5 2025 8:45 AM

చదవాలి.. రాయాలి

చదవాలి.. రాయాలి

● మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల కోసం ‘ఉల్లాస్‌’ ● మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కార్యక్రమం ● జిల్లా విద్యాశాఖ, సెర్ప్‌ ఆధ్వర్యంలో నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక

రామగిరి(రామగుండం): మహిళా సంఘాల్లో నిరక్ష రాస్యులైన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ, సెర్ప్‌ అధికారులు సమన్వయంతో ‘ఉల్లాస్‌’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించా రు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ అన్‌ ఇన్‌ సొసైటీ(ఉల్లాస్‌) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. దీనిని జిల్లావ్యాప్తంగా దశల వారీగా అమలు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తొలుత మ హిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. రెండోదశలో మధ్యలో బడిమానేసిన వారిని గుర్తించి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా నేరుగా పదో తరగతి చదివిస్తారు. ఆసక్తినిబట్టి ఓపె న్‌ డిగ్రీ వరకూ చదివించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ఉల్లాస్‌ కార్యక్రమం లక్ష్యం ఇదే..

సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లోని సభ్యుల్లో కేవలం 50 శాతం మందికే సంతకం చేయడం వచ్చని, మిగిలినవారు వేలిముద్ర వేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈక్రమంలోనే మహిళలు అందరికీ చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో ఉల్లాస్‌ను అమలులోకి తీసుకొస్తున్నారు. ఓపెన్‌ టెన్త్‌, ఓపెన్‌ డిగ్రీ వరకు చదివించడమే కాదు.. ఆసక్తిని బట్టి స్కిల్‌డెవలప్‌మెంట్‌, టెక్నికల్‌ కోర్సుల్లోనూ చేర్పించి ఉపాధి, అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం ఈ సందర్భంగా నేర్పిస్తారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లా, మండలస్థాయి కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, డీపీవో, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా మండల కమిటీలో చైర్మన్‌గా ఎంపీడీవో, ఎంఈవో, హెచ్‌ఎం, సీఆర్సీలు సభ్యులుగా కొనసాగుతారు.

తల్లి చదువుతో కుటుంబంలో వెలుగులు..

తల్లి చదవడం ద్వారా ఆ కుటుంబంలో వెలుగులు ప్రసరిస్తాయని, ఇలాంటి కుటుంబాల ద్వారా ఆ గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని సర్కార్‌ భావిస్తోంది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్స్‌ తగ్గితే బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుందని చెబుతోంది. అక్షరాస్యులుగా మారడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి అర్హులంద రి కీ ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటోంది.

వలంటీర్లుగా మహిళా సంఘాల్లోని అక్షరాస్యులైన సభ్యులు..

డీఆర్‌డీవో, సెర్ప్‌ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే పూర్తిచేశారు. 15 మంది నుంచి 20 మందితో గ్రూపును ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల్లోని అక్షరాస్యులైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి గ్రూపులను కేటాయించి చదువు చెప్పిస్తారు. గ్రూపు సభ్యులు చదవడం, రాయడం వచ్చే వరకు చదువు చెప్పే బాధ్యత వలంటీర్లకే అప్పగించారు. ఇందుకోసం పారితోషికం, గౌరవ వేతనం లేకుండానే కేవలం స్వచ్ఛందంగానే చదువు చెప్పాల్సి ఉంటుంది. అవసరమైన పుస్తకాలను విద్యాశాఖ అందిస్తుంది. ఉపాధ్యాయుల ద్వారా వలంటీర్లకు సహకారం అందిస్తుంది.

మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులు

జిల్లాలోని వివిధ మండలాల్లో గల మహిళా సంఘాల్లో ఇంకా చదవడం, రాయడం రాని మహిళలను అధికారులు ఇటీవల గుర్తించారు. అంతర్గాం మండలంలో 2,017 మంది, రామగుండం మండలంలో 1,711 మంది, పాలకుర్తి మండలంలో 2,609 మంది, మంథని మండలంలో 3,818 మంది, ముత్తారం మండలంలో 2,617 మంది, రామగిరి మండలంలో 2,317 మంది, కమాన్‌పూర్‌ మండలంలో 2,277 మంది, ధర్మారం మండలంలో 4,813 మంది, జూలపల్లి మండలంలో 2,349 మంది, ఎలిగేడు మండలంలో 2,642 మంది, సుల్తాన్‌బాద్‌ మండలంలో 3,727 మంది, ఓదెల మండలంలో 3,056 మంది, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 2,192 మంది, పెద్దపల్లి మండలంలో 5,311 మంది ఉన్నారని అధికారులు సర్వేలో తేల్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లో మొత్తం నిరక్షరాస్యులైన మహిళలు 41,456 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు.

లక్ష్యం 28వేల మంది..

తొలిదశలో సుమారు 28 వేల మంది నిరక్షరాస్యులైన మహిళా సంఘాల్లోని సభ్యులను అక్షరాస్యులు గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం వచ్చే ఏడాది మార్చి వరకు గడువు విధించారు. ఇందులో భాగంగానే ఈనెల 7న నిర్వహించే సమావేశంలో వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. శిక్షణ పూర్తయ్యాక మండలాల వారీగా బోధన తరగతులు ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement