
లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి
● రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు
కోల్‌సిటీ(రామగుండం): వన మహోత్సవం ద్వారా రామగుండం నగరంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ సూచించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం వన మహోత్సవం నిర్వహణపై వార్డు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ, డివిజన్లలో స్థలం లభ్యత ఆధారంగా వార్డు అధికారులకు మొక్కల సంఖ్య, లక్ష్యం నిర్దేశిచామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానికులను భాగస్వాములను చేయాలని అన్నారు. పశువుల నుంచి పరిరక్షించడానికి అవసరమైనచోట ట్రీ గార్డులను ఏర్పాటు చేయించాలని అన్నారు. ప్రస్తుత వాతావరణ అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువసంఖ్యలో మొక్కలు నాటాలని ఆదేశించారు. మెప్మా ఆర్పీల సహకారం తీసుకొని ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని కమిషనర్ సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈఈ షాబాజ్, ఏఈ తేజస్విని, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత తదితరులు పాల్గొన్నారు.