సివిల్ సెటిల్మెంట్ | - | Sakshi
Sakshi News home page

సివిల్ సెటిల్మెంట్

Aug 1 2025 12:31 PM | Updated on Aug 1 2025 1:00 PM

making a settlements

సెటిల్మెంట్ చేస్తూ దండుకుంటున్న వైనం

జిల్లాలో హద్దు మీరుతున్న పోలీసులు 

తమ పరిధి కాకున్న భూపంచాయితీల్లో జోక్యం 

సెటిల్‌మెంట్‌ చేస్తూ దండుకుంటున్న వైనం

సాక్షి, పెద్దపల్లి: ‘ఇక్కడ భూపంచాయితీలు, సివిల్‌ కేసులు నమోదు చేసుకోం.. వివాదాలు పరిష్కరించబడవు.. అనే బోర్డులు ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో కనిపిస్తుంటాయి. కాగా, సివిల్‌ కేసులు నమోదు చేసుకోరు.. కానీ, సెటిల్‌మెంట్‌ చేస్తారు’ అనే విధంగా జిల్లాలోని పలు ఠాణాల పోలీసులు వచ్చిన ప్రతీ సివిల్‌ కేసును అనధికారికంగా సెటిల్‌ చేస్తున్నారు. ఇరువర్గాల్లో ఏవరో ఒకరికి వంతపాడుతూ మిగితావారిని సెటిల్‌ చేసుకునేలా ఒప్పిస్తున్నారు. కొందరు పోలీసుల తీరు మొత్తం ఆ వ్యవస్థకే మచ్చతెస్తోంది. సామాన్యులు న్యాయం కోసం వెళ్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం మాని స్టేషన్‌లోనే పంచాయితీలు చేస్తున్నారు. విచారణ చేయకుండా ముడుపులు తీసుకుని పెదరాయుడి తీర్పులిస్తున్నారు.

నిబంధనల ప్రకారం

ఒక స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే అది సివిల్‌ కేసు అవుతుంది. దీన్ని కోర్టులో తేల్చుకోవాలి. అదే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో కూల్చివేతలు, బెదిరింపులు, దాడులకు దిగితే అది క్రిమినల్‌ కేసు పరిధిలోకి వస్తుంది. సివిల్‌, క్రిమినల్‌ కేసుల మధ్య ఉన్న ఈ చిన్న విభజన రేఖ ఆధారంగా పోలీసులు భూపంచాయితీల్లో ఎంటర్‌ అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు సివిల్‌ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. కానీ, కాలక్రమేణ ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్‌మెంట్లు యథేచ్ఛగా కొనసాగతున్నాయి.

సివిల్‌ కేసులంటేనే మక్కువ

ఇటీవలి కాలంలో రియల్‌ఎస్టేట్‌ రంగం ఊపందుకుని ప్లాట్ల ధరలు పెరిగాయి. దీంతో ఎక్కువ మంది వ్యవసాయ భూములపైన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ భూముల ధరలూ విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతుంటే వాటికి సంబంధించిన వివాదాలు కూడా గతంలో కంటే రెట్టింపయ్యాయి. సాధారణంగా భూ లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో పోలీసులు కలుగజేసుకోకూడదు. కానీ, మెజారిటీ పోలీస్‌స్టేషన్లలో సివిల్‌ పంచాయితీల సెటిల్‌మెంట్లకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్ధ, అంగబలం ఉన్నవారితో మిలాఖత్‌ అవుతూ.. పేదలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వచ్చే క్రైం, శాంతిభద్రత కేసుల కంటే భూపంచాయితీల కేసులపైనే ఖాకీలు మక్కువ చూపిస్తున్నారు. తమ పోస్టింగ్‌ కోసం రూ.లక్షలు వెచ్చిస్తుండడంతో, వాటిని భర్తీ చేసుకునేందుకు సివిల్‌ పంచాయితీల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

కఠిన చర్యలు తప్పవు

భూతగాదాల్లో తలదూరిస్తే సదరు పోలీస్‌ అధికారులపై కఠిన చర్యలు తప్పవు. ఈ విషయంలో ఇప్పటికే కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి బాధ్యులైన అధికారులపై తప్పక చర్యలు తీసుకుంటాం.

– కరుణాకర్‌, డీసీపీ, పెద్దపల్లి

● జిల్లాలో హద్దు మీరుతున్న పోలీసులు ● తమ పరిధి కాకున్న 1
1/1

● జిల్లాలో హద్దు మీరుతున్న పోలీసులు ● తమ పరిధి కాకున్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement