
అమ్మపాలు అమృతం
● నేటి నుంచి 7వరకు తల్లిపాల వారోత్సవాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): అమ్మపాలు అమృతంతో సమానం. నవజాత శిశువులకు వెలకట్టలేని సంపద. పిల్లల ఆరోగ్యం, మనుగడ, పోషణ, అభివృద్ధితో పాటు తల్లి ఆరోగ్యానికీ తల్లిపాలే కీలకం. ఈ విషయాన్ని తల్లుల గుర్తిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఉరుకులు పరుగుల జీవితంతో కొందరు తల్లులకు పాలుపట్టే సమయం దొరకడంలేదు. తల్లిపాల విశిష్ఠత, ప్రాధాన్యం గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి 7 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు.
జిల్లాలో..
జిల్లావ్యాప్తంగా 3 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయాకేంద్రాల పరిధిలో 3,902 మంది గర్భిణులు, 2,588 మంది బాలింతలు ఉన్నారు. వీరందరికీ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. కాగా, ముర్రుపాలు తాగిస్తేనే పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగేందుకు వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమాధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు.
అవగాహన కార్యక్రమాలు ఇలా..
● బిడ్డపుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం. పిల్లల ఎదుగుదలకు పోషణ ప్రాధాన్యతను వివరించడం.
● గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్య జాగ్రత్తలు సూచించడం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూడడం. 7–24 నెలల పిల్లలకు తల్లిపాలతో అదనంగా ఆహారం అందించాలని కుటుంబ సభ్యులకు వివరించడం.
● బాలింతలు, గర్భిణులకు కౌన్సెలింగ్ ఇవ్వడం. వారి వివరాలు పుస్తకంలో నమోదు చేయడం.
● ఆరునెలలలోపు చిన్నారులకు తల్లిపాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం. తల్లిపాలె ఉత్తమమని సూచించడం.