
కుటుంబం కోసం శ్రమించినవారిని గౌరవించాలి
కోల్‌సిటీ(రామగుండం): ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఉద్యోగి ఆఖరి పని దినం రోజే అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా పని చేసి గురువారం ఉద్యోగ విరమణ పొందిన ఆవునూరి మల్ల య్య, రేణికుంట్ల పోచయ్య, కుమ్మరి రాయపోషమ్మను సన్మానించి మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈఎల్(లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) ప్రయోజనం ప్రొసీడింగ్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం కుటుంబం కోసం శ్రమించిన వారిని కుటుంబ సభ్యులు గౌరవంగా చూసుకోవాలన్నారు. కాగా, కమిషనర్ ఆదేశాల మేరకు సదరు ఉద్యోగులను తొలిసారి బల్దియాకు చెందిన కార్లలో వారి ఇంటికి గౌరవంగా సాగనంపిన తీరుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, ఏసీపీ శ్రీహరి, డీఈ జమీల్, ఏఈ మీర్, ఆర్‌ఓ ఆంజనేయులు, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులున్నారు.