
మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత
పెద్దపల్లిరూరల్: చిన్నసమస్యలతో పంతాలు, పట్టింపులకు వెళ్లి వివాదాన్ని జటిలం చేసుకుని కోర్టుల వరకూ వెళ్లడం కన్నా మధ్యవర్తి సాయంతో అక్కడికక్కడే పరిష్కరించుకోవడం మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత సూ చించారు. జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం మ ధ్యవర్తిత్వంపై నిర్వహించిన అవగాహన సదస్సు లో జడ్జి మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్జి సునీ త, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి స్వరూపరాణి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తదితరులు ‘మధ్యవర్తిత్వం’ అంశానికి అనుకూలంగా సంతకాలు చేశారు. భార్యాభర్తలు చిన్న విషయాలకే పెద్దగొడవలు చేసుకుని విడిపోతున్నారని, అలాంటి సమస్యలను మధ్యవర్తి సమక్షంలో పరిష్కరించుకోవాలని జడ్జి సునీత సూచించారు. గతంలో తాను హైదరాబాద్‌లో పనిచేసినప్పుడు 32 జంటలకు ఇద్దరి అంగీకారంతో విడాకులు మంజూరు చేశానని జడ్జి సునీత గుర్తుచేశారు. విడిపోయిన భార్యాభర్తలు వేర్వేరుగా బాగానే ఉంటారని, కానీ వారిపిల్లల భవిష్యత్‌ను ఊహించడమే కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి పంపకాల్లోనూ గజం స్థలం కోసం కూడా కోర్టుమెట్లెక్కిన వారుఉన్నారని, ఇలా చేయడంతో ఆర్థికంగా నష్టపోవడం, సమయం వృథా చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని తెలిపారు. న్యాయవాదులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారాన్ని ప్రోత్సహించాలని జడ్జి సూచించారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్, గవర్నమెంట్ ప్లీడర్ కిశోర్‌తోపాటు శ్రీధర్, రవీందర్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.