
ఆటలతోపాటే సంగీతం
● జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక ● ఇప్పటికే స్కూళ్లకు చేరిన వాయిద్యాలు ● విద్యార్థులు సత్ఫలితాలు సాధించడమే లక్ష్యం
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆటాపాటలు, సంగీతం నేర్చుకోవడం ద్వారా చదువులో సత్ఫలితాలు సాధిస్తారనే ఆశయంతో సర్కారు సంగీత వాయిద్యాలను సరఫరా చేస్తోంది. ఈమేరకు జిల్లాలో ఇప్పటివరకు 16 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేశారు.
స్కూళ్లకు చేరిన వాయిద్యాలు..
జిల్లాలో ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ (పీఎంశ్రీ) ఎంపిక చేసిన 16 సర్కారు స్కూళ్లలో సంగీత తరగతులు నిర్వహించడానికి ఇప్పటికే సంగీత వాయిద్యాలను సరఫరా చేశారు. ఇందులో వయోలిన్, తబలా, మృదంగం, హార్మోనియం, బ్యాండ్ ఉన్నాయి.
ఆరో తరగతి నుంచే..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ,రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆసక్తిగల విద్యార్థులకు సంగీతం నేర్పి స్తారు. ఇందులో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ఉంటారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యం మేరకు పాఠశాల దశ నుంచే కళారంగంలో రాణించేందుకు సంగీతం నేర్పిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
త్వరలో ట్రెయినర్ల నియామకం
సంగీత పాఠాలు బోధించే ఒక్కో పాఠశాలకు ఒ క్కో ట్రెయినర్‌ను కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అనుభవం కలిగిన వారికి, రిటైర్డ్ ఆర్మీ సైనికులకు ప్రాధాన్యం ఇస్తారని తెలిసింది.
ట్రెయినర్లను ఎంపిక చేస్తాం
పీఎంశ్రీ పథకం ద్వారా విద్యార్థులకు సంగీతం నేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు అవసరమైన సంగీత వాయిద్యాలు పాఠశాలలకు చేరాయి. శిక్షణ ఇచ్చేవారి ఎంపికే మిగిలి ఉంది. – మాధవి, డీఈవో