
చిగురిస్తున్న ఆశలు
● టెండర్ దశలో ఈఎస్‌ఐ వంద పడకల ఆస్పత్రి ● రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ● కాంట్రాక్ట్ కార్మికులకు త్వరలోనే మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు ● కేంద్రప్రభుత్వం ప్రకటనతో సర్వత్రా హర్షం
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆస్పత్రి టెండర్ దశలో ఉందని వెల్లడించింది. రెండేళ్లలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించడంతో ఈ ప్రాంతంలోని సంఘటిత, అసంఘటిత కార్మిక రంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఉమ్మడి జిల్లా కార్మికులకు ప్రయోజనం..
పెద్దపల్లి జిల్లాలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం పరిశ్రమలతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగండం మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 20 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఈఎస్‌ఐ వందపడకల ఆస్పత్రి నిర్మిస్తే వీరందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
2018లోనే ఆమోదం..
రామగుండంలో వంద పడకల ఈఎస్‌ఐ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2018 సెప్టెంబర్ 20న ఈఎస్‌ఐసీ ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం తెలిపిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రామగుండం – లింగాపూర్ మధ్యలోని పాత ఈఎస్‌ఐ ఆస్పత్రి స్థలంలో దీనిని నిర్మించనున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, ఒప్పందం కుదిరాక నిర్మాణం పూర్తికావడానికి సుమారు రెండేళ్లు పడుతుందని అధికారులు తెలిపారు.
అందుబాటులోకి వచ్చే సేవలు ఇవే..
ఈఎస్‌ఐ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే.. అనేకమంది వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఐ, డెంటల్, పీడియాట్రిక్స్ వంటి వైద్యసేవలు కార్మికులకు అందనున్నాయి. మాడ్యూలర్ ఆపరేషన్ థియేటర్, సీఎస్‌ఎస్‌వో, మెడికల్ గ్యాస్ ౖపైపెన్ వంటి ఆధునిక సదుపాయాలూ అందుబాటులోకి వస్తాయి. ఔట్ పేషంట్, ఇన్ పేషంట్ సేవలు రెండూ అందించనున్నారు. కాగా, వైద్య సిబ్బంది నియామకానికి 2023 డిసెంబర్ 15న జరిగిన 192వ కార్పొరేషన్ సమావేశంలో ఆమోదించిన కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది.
రాజీవ్ రహదారి వెంట నిర్మిస్తే..
గోదావరిఖని ప్రాంతంలోని రాజీవ్ రహదారి సమీపంలోనే ఈఎస్‌ఐ వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తే కార్మికులకు అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి మూసివేసిన పవర్‌హౌస్ ప్రాంతం ఇందుకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంద ని అంటున్నారు. రామగుండంలో నిర్మిస్తే రోడ్డు, రవాణా తదితర సౌకర్యాలు ఉండవని పేర్కొంటున్నారు. పైగా గోదావరిఖని, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో పాటు మంచిర్యాలలోని కాంట్రాక్టు కార్మికులకూ అందుబాటులో ఉంటుందని వారు వివరిస్తున్నారు.

చిగురిస్తున్న ఆశలు