
ఉచితం మాటున అక్రమం
● రహస్య ప్రాంతాల్లో నిల్వలు ● రాత్రిపూట రాజధానికి తరలింపు ● జోరుగా ఇసుక అక్రమ రవాణా
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసా గు తోంది. స్థానికులకు ఉచితం మాటున అడ్డగోలుగా తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. తొలుత గోదా వరి నది నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి పలు రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఇలా డంప్‌చేసిన ఇసుకను లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలించి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.
ఎక్కడ చూసినా డంప్‌లే..
గోదావరిఖనిలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసి నా ఇసుక డంప్‌లే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా నగర శివారు కేంద్రాలుగా ఈ వ్యవహారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. గృహావసరాల కోసమని చెప్పి తీసుకొస్తున్న ఇసుక ను కొందరు ఒకచోట కుప్పగా పోసి, పెద్దఎత్తున నిల్వ చేసి.. ఆ తర్వాత లారీల ద్వారా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా తరలించి ఒక్కో ట్రిప్పును సుమారు రూ.50వేల వరకు విక్రయిస్తున్నారు. మంగళవారం పోలీసులు జరిపిన దాడిలో సప్తగిరికాలనీలో పెద్ద డంప్ లభించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే శాంతినగర్‌లో రెండు ఇసుక డంప్‌లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మల్లుస్వరాజ్యం కాలనీ, ఐబీకాలనీ, వాగువెంట ఉన్న ఏరియాల్లో డంప్ చేసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం.
స్థానిక అవసరాలు.. వాణిజ్యానికి తరలింపు
స్థానిక అవసరాల పేరుతో ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుంచి తీసుకొస్తున్న వ్యాపారులు.. అనేకచోట్ల డంప్‌లు ఏర్పాటు చేసి వాణిజ్య అవసరాల కోసం విక్రయిస్తున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమిస్తూ ఆర్నెల్లుగా ఈవ్యవహారం జోరుగా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు తరలిస్తే పెద్దఎత్తున సొమ్ము చేసుకోవచ్చనే అత్యాశతో కొందరు ఈదందాకు తెరలేపారు.
స్థానిక అవసరాలకు ఉచితంగా..
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల అవసరాల కోసం ఉచితంగా ఇసుక ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీంతో చాలామంది ఇసుకను ఉచితంగా తెచ్చుకుంటున్నారు. ఇదేఅదనుగా భావించి అక్రమార్కులు తమదైన శైలిలో ముందుకు సాగుతూ డంప్‌లు ఏర్పాటు చేసి అందినంత దండుకుంటున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
గృహావసరాల కోసం తీసుకొచ్చిన ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండాలనే ఆలోచనతో కలెక్టర్, ఎమ్మెల్యే ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలా దుర్వినియోగం చేస్తే ఊరుకునేదిలేదు.
– ఇంద్రసేనారెడ్డి, వన్‌టౌన్ సీఐ, గోదావరిఖని

ఉచితం మాటున అక్రమం