
కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా భూటకం
గోదావరిఖని: సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేస్తున్నదంతా నాటకమని, అది ఓ భూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. స్థానిక గంగానగర్‌లోని బీ జేపీ నేత అమరేందర్‌రావు నివాసంలో బుధవారం రాంచందర్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డైరెక్టరైతే.. మిగతా వాళ్లు యాక్షన్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. బీసీలను బీజేపీకి దూరం చేయాలనేది వారి నటన అని దుయ్యబట్టారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, అందులో రాజకీయంగా ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, అందులో జరిగిన అవినీతి, నాణ్యత లోపంపైనే ప్రశ్నించామని తెలిపారు. తమ పార్టీలోకి చాలామంది వచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశంలేదని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, నాయకులు కాసిపేట లింగయ్య, ఎస్.కుమార్, కందుల సంధ్యారాణి, గోమాస శ్రీనివాస్, బల్మూరి అమరేందర్‌రావు, బల్మూరి వనిత, సోమారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు.
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు