
నిందారోపణలు మానండి
● నిజాలు మాట్లాడండి ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు చందర్
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు నిజాలను దాచి, తమ పార్టీ నేతలపై నిందారోపణలకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకని నిలదీశారు. ఈశ్వర్‌పై మంత్రి లక్ష్మణ్‌కుమార్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ సర్కార్ అనేక పథకాలు చేపట్టిందని గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్సార్ తర్వాత రైతుసంక్షేమం గురించి ఆలోచించే నాయకులే కాంగ్రెస్ పార్టీలో లేరని వారు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు గంట రాములు, గోపు ఐలయ్య, రఘువీర్‌సింగ్, ఉప్పు రాజ్‌కుమార్, నారాయణదాస్ మారుతి, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, వెన్న రవీందర్, పల్లె మధు, మనోజ్, శ్రీధర్, లక్ష్మణ్, కొమురయ్య, శ్రావణ్, రామరాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.