
సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టండి
● సీపీ అంబర్‌కిషోర్‌ఝా
గోదావరిఖని(రామగుండం): సైబర్‌నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా ఆదేశించారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలన్నారు. మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్ష పడేలా తగు సాక్ష్యాధారాలను అందజేయాలన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు పోలీసు అధికారులు, సిబ్బంది సన్నద్ధం కావాలన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు ఎ.భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.