
అర్హులందరికీ రేషన్‌కార్డులు
● కారు, ట్రాక్టరు ఉందంటూ నిరాకరించొద్దు ● పేద కుటుంబాలకు న్యాయం చేయాలి ● మహిళల ముఖంలో చిరునవ్వే లక్ష్యం ● ఎమ్మెల్యే విజయరమణారావు ● కొత్తరేషన్‌కార్డులు పంపిణీ
పెద్దపల్లిరూరల్: మహిళల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాలకు చెందిన 4,847మందికి కొత్త రేషన్‌కార్డులను జిల్లా కేంద్రంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కారు, ట్రాక్టర్ ఉందనే నిబంధనతో అర్హులైన కొందరు పేదలకు అన్యాయం జరుగుతోందని తన దృష్టికి వచ్చిందని, దానిని పరిగణనలోకి తీసుకోకుండా రేషన్‌కార్డు జారీచేయాలని అధికారులకు సూచించారు. డీఎస్‌వో శ్రీనాథ్, తహసీల్దార్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ప్రకాశ్‌రావు, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేపట్టిన ఉచిత కళ్లద్దాల పంపిణీని ఆయన డీసీహెచ్‌ఎస్ శ్రీధర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. పెద్దపల్లి సర్కారు ఆస్పత్రిలోనే ఆర్నెల్లుగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఏఎంసీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్ పాల్గొన్నారు.