
టార్గెట్ టీబీజీకేఎస్
● చురుకై న నేతలపై బదిలీ వేటు ● మరికొందరిపైనా ఇదే అస్త్రం? ● ఉద్యోగ విరమణ చేసేవారిని కూడా వదలని యాజమాన్యం ● రాజకీయ కోణంలోనే ట్రాన్స్‌ఫర్లని విమర్శలు ● పాలనాపరమైన చర్యల్లో భాగమే అంటున్న సింగరేణి ● బదిలీలను రద్దు చేయాలని కార్మికుల డిమాండ్
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పదేళ్లపాటు గుర్తింపు కార్మిక సంఘంగా వ్యహరించి అనేక సమస్యలు పరిష్కరించి, ఎన్నో హక్కులు సాధించి పెట్టిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) టార్గెట్‌గా రాజకీయ బదిలీలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ కోల్‌బెల్ట్‌లో ప్రా రంభమైంది. యూనియన్ ఇన్‌చార్జిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించిన క్రమంలోనే ముఖ్య నాయకుల బదిలీ కావడం సర్వత్రా ఆందోళనకు దారితీస్తోంది. ఉద్యోగ విరమణకు ఏడాది గడువున్న నాయకులను కూడా వదిలిపెట్టకుండా మణుగూరు, ఇల్లెందు తదితర సుదూర ఏరియాలకు బదిలీ చేయడం రాజకీయ కోణంలో భాగమేనని కార్మికులు, నాయకులు అంటున్నారు.
రాజకీయ కక్షే అంటూ ప్రచారం..
టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తిని ఆర్జీ–2 ఏరియా నుంచి మణుగూరుకు, ఆర్జీ–2 ఏరియా వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న బాలసాని కొమురయ్యను ఇల్లెందుకు బదిలీ చేశారు. ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీలో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న జాహిద్‌పాషాను మణుగూరు బదిలీ చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. అయితే, రాజకీయ కక్షతోనే బదిలీలు వెలుబడ్డాయని ప్రచారం జరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్‌లో టీబీజీకేఎస్ బలంగా ఉందని, ఇక్కడ నాయకులను బదిలీ చేసి వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఆలోచనతో అధికార కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ ఐఎన్‌టీయూసీ.. సింగరేణి ద్వారా బదిలీ ఉత్తర్వులు ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే వీరిలో కొమురయ్య యూనియన్ కార్యాకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ బదిలీ ఎందుకు చేశారో అర్థం కావడం లేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. ముగ్గురిలో జావిద్ పాషాకు ఒక్కరికే 13 ఏళ్ల సర్వీస్ ఉందని వారు అంటున్నారు.
హెచ్‌ఎంఎస్ నేతలకూ ఇదే అనుభవం..
రామగుండం రీజియన్‌లో పనిచేసిన హెచ్‌ఎంఎస్ నాయకులను కూడా గతంలో ఇదేవిధంగా సుదూర ప్రాంతాలకు సింగరేణి బదిలీ చేసిందని అంటున్నారు. అప్పటి గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ మాతృ పార్టీ బీఆర్‌ఎస్ ఆకస్మిక బదిలీలకు తెరలేపిందని కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు ముగ్గురు నాయకులను బదిలీచేసినా.. అక్కడకు వెళ్లలేక.. ఇక్కడ ఉండలేక సతమతమయ్యారు. అయితే, ఆనాడు ఆ బదిలీలపై ఎందుకు మాట్లాడలేదని హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్‌అహ్మద్.. అప్పుడు ‘సాక్షి’లో ప్రచురితమై బదిలీల కథనాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
రద్దుకాని బదిలీ ఉత్తర్వులు..
బదిలీ ఉత్తర్వులతో నాయకులు ఆందోళనకు గురైనా.. ఏడాదిలోపే సర్వీస్ ఉండడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని యత్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులను బదిలీ చేయొద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కొందరు పేర్కొంటున్నారు. మరోవైపు.. ఒకవేళ బదిలీ ఉత్తర్వులు తీసుకుంటే బదిలీ అయిన వారికి రూ. 2లక్షల మేర రవాణా భత్యం వచ్చే అవకాశం ఉందని జీఎం కార్యాలయం సిబ్బంది పేర్కొంటున్నారు.
మరో పదిమంది బదిలీకి రంగం సిద్ధం!
సింగరేణిలోని మరో పదిమంది నేతలకూ బదిలీ తప్పకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఎవరెవరు బదిలీ అవుతారు? కక్ష సాధింపు చర్యలు ఎక్కడ వరకు వెళ్తాయనే చర్చ జోరందుకుంది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన బదిలీల రద్దుకు కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించాయి.
నేడు గోదావరిఖనికి టీబీజీకేఎస్ ఇన్‌చార్జి
టీబీజీకేఎస్ ఇన్‌చార్జి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం గోదావరిఖనికి రానున్నారు. ఇన్‌చార్జిగా నియామకమయ్యాక తొలిసారి వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఆ యూనియన్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
యాజమాన్యం ఆదేశాల మేరకే బదిలీలు
పాలనా పరమైన ఆదేశాల మేరకు బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో రాజకీయ కోణాలు ఏమీలేవు. అన్నీ నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి.
– లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1

టార్గెట్ టీబీజీకేఎస్

టార్గెట్ టీబీజీకేఎస్

టార్గెట్ టీబీజీకేఎస్

టార్గెట్ టీబీజీకేఎస్