మురుగునీటి ప్రవాహం ఇక సాఫీగా.. | - | Sakshi
Sakshi News home page

మురుగునీటి ప్రవాహం ఇక సాఫీగా..

Jul 21 2025 5:19 AM | Updated on Jul 21 2025 5:19 AM

మురుగ

మురుగునీటి ప్రవాహం ఇక సాఫీగా..

● ఎట్టకేలకు నాలాల్లో పూడికతీత పనులు ప్రారంభం ● కలెక్టర్‌ చొరవతో రూ.5 లక్షలు మంజూరు ● పనుల్లో వేగం పెంచిన అధికారులు ● సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): సుల్తానాబాద్‌ మేజర్‌ గ్రామపంచాయతీగా దినదినాభివృద్ధి చెంది మున్సిపల్‌గా ఆవిర్భవించింది. ఆ తర్వాత సమీపంలోని పూసాల, సుగ్లాంపల్లి గ్రామాలను ఇందులో విలీనం చేశారు. దీంతో బల్దియా భౌగోళిక విస్తీర్ణం బాగా పెరిగింది. కొత్తకాలనీలు ఆవిర్భవిస్తున్నాయి. జనా భా కూడా పెరుగుతూ వస్తోంది. ఇదేసమయంలో ముగునీటి కాలువల నిర్మాణం అత్యవసరమైంది.

పూడికతీయక.. రోడ్లపైకి మురుగు..

రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న మున్సిపల్‌ ప్రాంతంలో కొత్తగా మురుగునీటి కాలువలు ఆశించిన స్థాయిలో నిర్మించక.. ఉన్నకాలువల్లో పూడిక తీయక మురుగంతా రోడ్లపైకి వచ్చే చేరుతోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో సమస్య జటిలమైంది. దోమలకు నిలయంగా మారే ప్రమాదం ఏర్పడింది. దీంతో మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగారు. పారిశుధ్య కార్మికులు, వాహనాలతో పట్టణంలోని పలు ప్రధాన మురుగునీటి కాలువల్లో పూడికతీత ప్రారంభించారు. అయితే, వర్షాకాలం వచ్చిందంటేనే పనులు చేసి చేతులు దులుపుకోవడం పాలకవర్గాలు, అధికారులకు అలవాటై పోయిందని, మిగతా సమయాల్లో పూడికతీత సక్రమంగా ఎందుకు చేయడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు.

15 వార్డులు.. సమస్యలు అనేకం..

మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో అనేక సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు గుర్తించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. ప్రధానంగా శాస్త్రినగర్‌, స్వప్నకాలనీ, మార్కండేయకాలనీ, జవహర్‌నగర్‌, సుభాష్‌నగర్‌, ఆరేపల్లి, పూసాల, సుగ్లాంపల్లి, పోచమ్మవాడ, గౌడవీధి, జెండా ఏరియా తదితర ప్రాంతాల్లో మురుగునీటితోపాటు పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించావని పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షపునీరు కాలువల్లో చేరుతోంది. అయితే, డ్రైనేజీలు సక్రమంగా లేక వరదతోపాటు మురుగునీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేవు. కొందరు నాలాలు ఆక్రమించి నిర్మాణం చేపట్టడం ప్రధాన సమస్యగా ఏర్పడిందని అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆక్రమణాలు తొలగిస్తే డ్రైనేజీ సమస్య తలెత్తేది కాదంటున్నారు.

కలెక్టర్‌ చొరవతో నిధులు మంజూరు..

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఇటీవల మున్సిపల్‌ కార్యాల యాన్ని తనిఖీ చేశారు. బల్దియా అధికారులతో వివిధ సమస్యలపై సమీక్షించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇందు కోసం రూ.5 లక్షలు తక్షణమే మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

జోరందుకున్న పూడికతీత పనులు..

కలెక్టర్‌ నిధులు మంజూరు చేయడంతో బల్దియా అధికారులు తొలుత డ్రైనేజీల్లో పూడికతీత పనులను ఈనెల 16న ప్రారంభించారు. వర్షాకాలం కావడంతో రహదారులపై నీరు నిల్వ ఉండకుండా పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే నీరు నిల్వఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్‌ వేస్తున్నారు. మరుగునీటి కాలువల్లోనూ ఆయిల్‌బాల్స్‌ వేయాలని సిబ్బందికి సూచించారు. రక్షిత మంచినీటి పథకంలోనూ నిత్యం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని ఆదేశించారు. ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అధికారులు సూచిస్తున్నారు.

వ్యాధుల కట్టడికి చర్యలు

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాం. చాలాకాలంగా పూడికతో నిండిపోయిన డ్రైనేజీలను గుర్తించాం. ఇలా పట్టణవ్యాప్తంగా సుమారు 24 డ్రైనేజీలు గుర్తించాం. వాటిలోని పూడికను శరవేగంగా తొలగిస్తున్నాం. కొన్నిడ్రైనేజీల్లో ఆయిల్‌బాల్స్‌ వేశాం. ప్రజలు కూడా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాతో సహకరించాలి. – తిప్పరాజు రమేశ్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, సుల్తానాబాద్‌

మురుగునీటి ప్రవాహం ఇక సాఫీగా.. 1
1/1

మురుగునీటి ప్రవాహం ఇక సాఫీగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement