
కాలువకు జీవం
మంథనిరూరల్: ఒకవైపు మట్టితో నిండి.. మరోవైపు తుమ్మచెట్లు, ముళ్లపొదలతో కమ్ముకుని ఆనవాళ్లు కోల్పోయిన ఎస్సారెస్పీ డీ–83 కాలువకు ఎట్టకేలకు జీవం పోస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కెనాల్‌కు మోక్షం లభిండంతో చివరి ఆయకట్టుకూ సాగునీరు అందుతుందని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఎగ్లాస్‌పూర్ సమీపంలోని డీ – 83 కాలువ పూడికతీత పనులు ఐదురోజుల క్రితం ప్రారంభించారు. గతంలోనూ పలుమార్లు పూడిక తీసినా.. పనులు నామమాత్రంగా చేపట్టడంతో కొన్నిరోజులకే పూడుకుపోయింది. చివరి ఆయకట్టుకు చుక్కనీరు చేరేది కాదు. ఈసారి ఆనవాళ్లు బయటపడేలా సంపూర్ణంగా పూడిక తీస్తుండడంతో సాగునీటికి ఢోకా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరవై ఏళ్ల తర్వాత..
ఇరవై ఏళ్ల తర్వాత మంథని మండలం రచ్చపల్లి నుంచి ఖానాపూర్ వరకు సుమారు 3 కి.మీ పొడవున డీ– 83 కెనాల్ పూడికతీత పనులు చేపట్టారు. సుమారు 20 ఏళ్లక్రితం కాలువ ని ర్మించారు. ఆ తర్వాత పూడికతో నిండిపోయింది. ప్రతీ సంవత్సరం పూడికతీత నామమాత్రంగా చేపట్టడంతో మట్టి, ముళ్లపొదలతో నిండిపోతూ వస్తోంది. ఈసారి సంపూర్ణంగా పనులు చేపట్టేందుకు రూ.6లక్షలు వెచ్చించారు.
1,500 ఎకరాలకు సాగునీరు..
ఎస్సారెస్పీ డీ– 83 కెనాల్ పూడికతీతతో ఆయకట్టు పరిధిలోని దాదాపు 1,500 ఎకరాలకు సంపూర్ణంగా సాగునీరు అందే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గతంలో పూడికతో నిండిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదు. రచ్చపల్లి, ఎగ్లాస్‌పూర్, ఖానాపూర్, శాస్త్రులపల్లి గ్రామాల్లోని చివరి ఆయకట్టు పంటలు నీళ్లు అందక ఏటా ఎండిపోయేవి. ఈసారి ఆ భూములకు కాలువ ద్వారా సాగునీరు అందనుంది.
నివాసాల్లోకి.. రోడ్లపైకి..
దిగువన కాలువ పూడికతో నిండిపోవడంతో నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.. ప్రత్యామ్నాయంగా ఊళ్లలోకి సాగునీరు ప్రవేశించేది. కాలువ ద్వారా నీళ్లు వదిలితే ఏటా ఎగ్లాస్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బైరన్‌గడ్డలో నీళ్లు వరదలా ప్రవహించేవి. కొన్ని నివాసాలను ముంచెత్తేవి. మరికొన్ని పంట పొలాల్లోకి చేరి పంటలకు నష్టం కలిగించేవి. అంతేకాదు.. కాలువలో పూడిక నిండి దుర్గంధం వెదజల్లేది. విషపురుగులు, సర్పాలకు నిలయంగా మారేది. ఈసారి పూడికతీతతో ఆ పరిస్థితి ఉండదని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాల తర్వాత పూడికతీత
1,500ఎకరాలకు సాగునీరు అందే అవకాశం
రూ.6లక్షలతో పనులు చేపట్టిన అధికారులు
హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు

కాలువకు జీవం

కాలువకు జీవం