
కాన్పులు.. కాసులు
● ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు ● ప్రైవేట్‌లో తగ్గిన నార్మల్ డెలివరీలు ● గర్భిణుల ఆరోగ్యంతో చెలగాటం ● పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
సాక్షి పెద్దపల్లి: ‘సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడండి.. అలా చేస్తే తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిది.. సాధారణ ప్రసవమైతే పుట్టిన గంటలోపే తల్లిపాలు బిడ్డకు పట్టించడానికి వీలుంటుంది.. ఇలా తొలిగంటలో అమ్మపాలు తాగిన శిశువు లు చాలాఆరోగ్యంగా ఉంటారు’ అని డాక్డర్లు తర చూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గర్భిణుల ను కడుపు‘కోత’లు కలవరపెడుతున్నాయి. ప్రభు త్వ ఆస్పత్రుల్లో సీజేరియన్లు తగ్గి నార్మల్ డెలివరీలు పెరుగుతున్నా.. ప్రైవేట్ దవాఖానాల్లో సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. సంపాదనే ధ్యేయంగా కొందరు గైనకాలజిస్ట్‌లు ఆడ్డగోలుగా పెద్దాపరే ష న్లు చేస్తూ మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతు న్నారు. ప్రైవేట్‌లో ప్యాకేజీల పేరిట భారీగా ఫీజు వ సూలు చేస్తూ సిజేరియన్ ప్రసవాలు చేసేస్తున్నారు.
ఆదేశాలు ఉన్నా మారని తీరు..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీజేరియన్లు తగ్గించాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా ఉమ్మనీరు తక్కువ ఉందని.. బిడ్డ అడ్డం తిరిగిందని.. గుండె వేగంగా కొట్టుకుంటోందని.. గర్భిణి బలహీనంగా ఉందని.. రక్తం తక్కువ ఉందని.. పురిటి నొప్పులు భరించలేదని.. నార్మల్‌కు వెళ్తే తల్లీబిడ్డ ప్రాణాలకు తాము గ్యారంటీ ఇవ్వలేమని.. ఇలా రకరకాల కారణాలు చెబుతూ గర్భిణుల కుటుంబీకులను వైద్యులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సిజేరియన్లకు ఒప్పుకునేలా వారిపై ఒత్తిడి చేస్తున్నారు. సిజేరియన్లతో దీర్ఘకాలంలో తల్లికి ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరాల్సిన వైద్యులే.. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయడం శోచనీయం. సీజేరియన్ల తర్వాత తరచూ కడుపునొప్పి, ఇన్ఫెక్షన్, స్థూలకాయం, నెలసరి సక్రమంగా కాకపోవడం తదితర సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరుగుతున్న ముహూర్తాల కల్చర్
పుట్టుబోయే బిడ్డకు మంచిరోజు, తిథి, నక్షత్రం, వారం చూసుకొని మరీ సిజేరియన్ చేయిస్తున్నారు కొందరు కుటుంబీకులు. బిడ్డకు జన్మనివ్వడానికి కూడా ముహూర్తాలు చూసుకుంటున్న కల్చర్ ప్రస్తుతం పెరిగిపోతోంది. దీనికోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్‌బుక్ చేసుకొని ఆపరేషన్లకు అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారు. పలానా టైమ్‌కి మత్తుమందు ఇవ్వాలి.. పలానా సమయానికి బిడ్డ తల్లికడుపులోంచి బయటకు రావాలి.. అంటూ ముహుర్తాల మూఢనమ్మకంతో కచ్చితమైన తేదీ, సమయం చూసుకొని కొందరు అవసరంలేకున్నా సిజేరియన్లు చేయిస్తున్నారు. ఇవన్నీ గర్భిణుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దీర్ఘకాలంగా తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.

కాన్పులు.. కాసులు