
విద్యుత్ సమస్యలపై రైతుల ధర్నా
గంభీరావుపేట/గన్నేరువరం: అప్రకటిత కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు బుధవారం ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ వానాకాలం పంటల సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కరెంటు కోతలు పెరిగాయన్నారు. లోవోల్టేజీతో విద్యుత్‌మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేటలో సెస్ ఏఈ అనంద్‌కుమార్ రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి
గద్దె నిర్మించినా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో రైతులు రోడ్డెక్కారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ట్రాన్స్‌ఫార్మర్ లేక పొలాలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ అమర్చి పంటలను కాపాడాలని కోరారు.