
‘పొగ’చూరుతున్నయ్..
● సర్కారు బడుల్లో కట్టెల పొయ్యిలపైనే వంటలు ● ప్రతిపాదనలకే పరిమితమైన వంటగ్యాస్ సిలిండర్లు ● వర్షాకాలంలో నిర్వాహకులకు తప్పని తిప్పలు
మంథనిరూరల్: జిల్లాలోని సర్కారు బడుల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం కట్టెల పొయ్యిలతో పొగజూరిపోతోంది. ఏళ్లతరబడి ఈ పథకంలో నిర్వాహకులకు కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. దీంతో వర్షాకాల మంతా ఇబ్బందులు పడుతుండగా, మిగతా కాలాల్లో కట్టెల కోసం నానా తంటాలు పడుతున్నారు.
కట్టెల పొయ్యిలపైనే..
మంథని మండలంలోని 56 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతీరోజు పాఠశాలల ఆవరణలోనే భోజనం తయారు చేస్తున్నారు. వంటల తయారీకి కట్టెల పొయ్యిలే వినియోగిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండడంతో వారికి తగిన భోజనం తయారీకి కట్టెల పొయ్యిలపై పెద్దగా ఇబ్బంది లేకున్నా.. హైస్కూళ్లలో అధికంగా ఉండే విద్యార్థుల కోసం ఎక్కువ భోజనం వండి పెట్టడం సమస్యగా మారుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో తప్పని తిప్పలు..
వర్షాకాలంలో దాదాపు మూడు నెలలపాటు కట్టెల పొయ్యిలపై వంటలు చేయడం నిర్వాహకులకు చుక్కలు చూపుతోంది. వర్షానికి కట్టెలు తడిసి మంట మండకపోవడంతో పొగచూరి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండవస్తేనే కట్టెలు ఆరబెట్టుకునినే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల కట్టెలు లభించక, మార్కెట్‌లో అధిక ధరలు పలుకుతుండడంతో నిర్వాహకులకు కొనుగోలు చేయడం ఆర్థికంగా భారంగా మారుతోంది.
ప్రతిపాదనలకే పరిమతమైన..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించే నిర్వాహకులకు వంట గ్యాస్ సిలిండర్లు మంజూరు చేస్తామని సర్కారు ప్రకటనలు మంథని మండలంలో ఇంకా అమలులోకి రావడంలేదు. ఈక్రమంలో గత ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన ప్రతిపాదనలు రూపొందించి సర్కారుకు పింపించారు. కానీ, ఇప్పటివరకు ఆ ఊసేలేకుండాపోయింది.

‘పొగ’చూరుతున్నయ్..