
పంటల బీమా ఉన్నట్టా.. లేనట్టా
● వర్షాభావ పరిస్థితులతో సాగు ప్రశ్నార్థకం ● వాగు పారలే.. చెరువు నిండలే ● సగానికి పైగా మండలాల్లో లోటు వర్షపాతమే
కరీంనగర్ అర్బన్: గతేడాది సాధారణానికి మించి వర్షపాతం నమోదవగా ఈసారి కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడం గడ్డు పరిస్థితేనని స్పష్టమవుతోంది. జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాల్లో పంటలు సాగవుతుండగా 10 మండలాల్లో లోటు వర్షపాతమే వెంటాడుతోంది. చిగురుమామిడి, సైదాపూర్, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం మండలాలు మినహా గంగాధర, రామడుగు, చొప్పదండి, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో లోటు వర్షపాతమే.
వ్యవసాయమే ఆధారం
జిల్లాలో అత్యధిక జనాభాకు వ్యవసాయమే ఆధా రం. వర్షాభావ పరిస్థితులతో సాగు ప్రశ్నార్థకంగా మారగా ప్రతికూల పరిస్థితుల క్రమంలో చేయూతగా నిలవాల్సిన ప్రభుత్వం పంటల బీమా విషయంలో స్పష్టతనివ్వకపోవడం ఆందోళనకర పరిణామం. శ్రీఆదిలోనే హంసపాదుశ్రీ అన్నట్లు సాగు తొలినాళ్లలోనే వర్షం దోబూచులాడుతుండగా రైతు పెట్టిన పెట్టుబడి ఇక అంతే. ఈ క్రమంలో తక్షణమే పంటల బీమా అమలు చేసి రైతులను తదనుగుణంగా ప్రోత్సహించాల్సి ఉండగా ఆ దిశగా చర్యల్లేకపోవడం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది.
మడులలోనే నారు
ఇప్పటికే సగానికి పైగా నాట్లు పడాల్సి ఉండగా ఇంకా మడులలోనే నారు ఉండిపోయింది. వర్షాలు లేక, కాలువల్లో నీటిని విడుదల చేయక పొలం మడులు ఎడారులను మరిపిస్తున్నాయి. గతేడాది ఈ సమయానికి నాట్లతో కళకళలాడగా నేడు వెలవెలబోతున్నాయి. జిల్లాలో వానాకాలంలో సాధారణ సాగు 2.74లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు సాగైంది 38వేల ఎకరాలు మాత్రమే. తొలుత రుతుపవనాలు ముందే వచ్చాయా..అన్నట్లు మురిపించగా తదుపరి ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి.
బోసిపోతున్న చెరువులు, కుంటలు
జిల్లాలో చెరువులు, కుంటలు బోసిపోతున్నాయి. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, జమ్మికుంట, హుజూరాబాద్, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లోని హెచ్చు చెరువులు బీడుగా మారగా ఇల్లందకుంట, చిగురుమామిడి, సైదాపూర్, వీణవంక, శంకరపట్నం మండలాల్లోని చెరువులు అట్టడుగున నీరు చేరింది. మొత్తం 1,376 చెరువులుండగా ఎక్కడా నిండిన దాఖలాలే లేవు. ఎస్సారెస్పీ కింద ఆయకట్టు ఉండగా ఎగువన వర్షాలు కురిస్తేనే వరి పంటకు భరోసా. ఇక జిల్లాలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్, సమీప మధ్యమానేరు జలాశయాలకు ఇన్‌ఫ్లో లేదు. ఇక గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి జలాశయాలు పచ్చికబయళ్లను మరిపిస్తున్నాయి.
ఊసేలేని పంటల బీమా
వివిధ రకాల పంటలకు ఇప్పటికే పంటల బీమా అమలు కావాల్సి ఉండగా ఆ ఊసే లేదు. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు పగుళ్లు చూపుతుండగా ఇలాగే కొనసాగితే మళ్లీ పంట వేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో తక్షణమే పంటల బీమా అమలు చేస్తేనే కర్శకునికి కొంత సాంత్వన.
గతేడాది, ఈసారి ఇప్పటివరకు కురిసిన వర్షం వివరాలిలా, బ్రాకెట్లో సాధారణ వర్షపాతం (మి.మీటర్లలో)
జిల్లాలో..
వానకాలం సాగు అంచనా 3.04లక్షల ఎకరాలు
సాగైన విస్తీర్ణం 75,715 ఎకరాలు
ఇందులో వరి 38,459 ఎకరాలు
పత్తి 35,361 ఎకరాలు
కందులు 126 ఎకరాలు
మొక్కజొన్న 1,682 ఎకరాలు
పెసర 87 ఎకరాలు
సంవత్సరం జూన్ జూలై
2024 208.2(124.3) 42.0(73.1)
2025 99.5 (124.3) 51.0(70.5)