
బందోబస్తు మధ్య అంత్యక్రియలు
వెల్గటూర్(ధర్మపురి): ప్రేమ వ్యవహారం నేపథ్యంలో గురువారం హత్యకు గురైన చల్లూరి మల్లేశ్ అంత్యక్రియలు శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య గ్రామంలో నిర్వహించారు. అంతకుముందు మృతుడి తల్లిదండ్రులు రాజయ్య, భూదమ్మ మాట్లాడుతూ, కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన యువతితో తమ కుమారుడికి ప్రేమ వ్యవహారం నడుస్తుందని తెలిపారు. ఈ విషయమై గతంలో యువతి బంధువులు తమ కుమారుడిని కొట్టారని, తాము వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించగా, వారు తమ కుమారుడిపై కేసులు పెట్టించారని పేర్కొన్నారు. తర్వాత కొద్ది రోజులు ఆ అమ్మాయితో తమ కుమారుడు మాట్లాడలేదని, కానీ, మళ్లీ ఆమె ఫోన్ చేసినట్లు తెలిపారు. గతంలో హార్వెస్టర్ నడిపించిన తమ కొడుకు ఆ అమ్మాయి మూలంగా హార్వెస్టర్ అమ్ముకోవడంతో పాటు ఆర్థికంగా దోచుకున్నారని ఆరోపించారు. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏదో పని ఉందని చెప్పి బయటకు తీసుకెళ్లారని, తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమ కుమారుడు చనిపోయాడని పోలీసులు చెప్పారని మృతుడి తల్లిదండ్రులు బోరుమన్నారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని యువతి తండ్రి రాజిరెడ్డి మరో ఇద్దరితో కలిసి పొట్టన పెట్టుకున్నారని కన్నీరుపెట్టారు. కాగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన పోలీసులు శాంతియుతంగా అంత్యక్రియలు జరిగేలా కృషి చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమసాగర్ మాట్లాడుతూ, కిషన్‌రావుపేటకు చెందిన రాజిరెడ్డికి తన కూతురు విషయంలో మృతుడు మల్లేశ్‌కు మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, వెల్గటూర్ స్టేషన్‌లో మల్లేశ్‌పై పలు కేసులు నమోదయినట్లు తెలిపారు. కేసులు నమోదు చేసినా మల్లేశ్‌లో మార్పు రాకపోవడంతో ఆగ్రహం పెంచుకున్న రాజిరెడ్డి, అతడి తమ్ముడు మల్లారెడ్డి, మల్లారెడ్డి స్నేహితుడు కొత్తపేటకు చెందిన చింతల హరీశ్ గురువారం మధ్యాహ్నం వెల్గటూర్ మండల కేంద్రంలోని కోటిలింగాల రోడ్డు పాత వైన్స్ వెనకాల మల్లేశ్‌ను కత్తులతో పొడిచి హత్య చేసినట్లు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

బందోబస్తు మధ్య అంత్యక్రియలు