
గుండెపోటుతో వ్యక్తి మృతి
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని నాచుపల్లి గ్రామంలో గల బృందావన్ రిసార్ట్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన పల్లికొండ చిన్నిరాజం(52) నాలుగేళ్లుగా బృందావన్ రిసార్ట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తన బట్టలు ఉతుక్కోవడానికి బాత్రూంకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి భార్య నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
రాయికల్(జగిత్యాల): మండలంలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన బెక్కం సాయిలు(65) శుక్రవారం రాత్రి తాట్లావాయి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిలు తన పొలం నుంచి ఇంటికి కాలినడక వెళ్తుండగా ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.