
గాలిలేదు.. ఊపిరాడదు
● ఉక్కిరిబిక్కిరవుతున్న కార్మికులు ● నెలరోజుల్లేనే పలువురికి అస్వస్థత ● పట్టించుకోని జీడీకే – 11 గని అధికారులు
గోదావరిఖని: ఆ గనిలో నెలరోజుల్లో పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పనిస్థలాల్లో గాలి లేక కుప్పకూలిపోతున్నారు. ఆర్జీ –వన్ ఏరి యా జీడీకే–11 గనిలో వరుస ఘటనలు చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురవుతున్నారు.
పూర్తిగా యాంత్రీకరణ చేసినా..
జీడీకే–11 గనిని పూర్తిస్థాయి యాంత్రీకరణ చేశారు. అయితే, కంటిన్యూస్ మైనర్–1, ఎల్‌హెచ్‌డీ ప్రాంతంలో వెంటిలేషన్ సౌకర్యం లేదంటున్నారు. కొద్దిరోజులుగా అక్కడ పనిచేస్తున్న సుమారు పదిమంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్పృహకోల్పోయిన వారిని వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రధానంగా ఎల్‌హెచ్‌డీ ప్రాంతంలో ఎక్కువగా సమస్యలున్నాయని, పనిస్థలాలు దూరంగా ఉండడం, డ్రిల్లింగ్ టూల్స్ అందుబాటులో లేకపోవడం, గాలి అందకపోవడంతో ఊపిరి తీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని కార్మికులు భయపడుతున్నారు. బురదతో సతమతమవుతున్నామంటున్నారు. ఈవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సమస్య గురించి చెప్తే గని ప్రధాన అధికారి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. వాస్తవానికి పనిస్థలాల్లో గాలి సౌకర్యం పెంచేందుకు జెట్రన్ ఫ్యాన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈఫ్యాన్ ఏర్పాటు చేయడానికి మ్యాన్‌పవర్‌తోపాటు సమయం వృథా అవుతుందని, మరికొద్ది రోజుల్లో మూసివేసే ప్యానెల్‌కు ఇదంతా అనవసరమా అని అధికారులు దాటవేస్తున్నారని పేర్కొంటున్నారు.
పనిచేయని రూఫ్‌బోల్టర్ యంత్రం
గనిలోని పైకప్పు సపోర్ట్ కోసం హోల్స్ వేసే రూఫ్‌బోల్టర్ పనిచేయడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో ఇటీవల అక్కడ పనిచేస్తున్న శ్రీకాంత్ అనే యాక్టింగ్ కోల్‌ఫిల్టర్ మెడపై బొగ్గు పెల్లపడి గాయాలపాలయ్యాడు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
కార్మికుల్లో ఆగ్రహం
షిఫ్టు ముగింపు సమయంలో ప్రత్యేక ట్రాలీలో గనిపైకి వచ్చే అధికారి ఒక్కరు ఉంటున్నారని, అందులో మరో 50మందిని తీసుకొచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలసిపోయిన కార్మికులను పట్టించుకోకుండా నియంతలాగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈగనిలో శుక్రవారం కూడా ఓ కార్మికునికి స్వల్పగాయాలయ్యాయని తెలిసింది.
వెంటిలేషన్ మెరుగ్గానే ఉంది
గనిలో కొందరు అస్వస్థతకు గురైన మాట వాస్తవమే. అయితే, వెంటిలేషన్ లేకకాదు. అనారోగ్యంతో కొందరు, ఆహారం లేక మరికొందరు అస్వస్థతకు గురైనట్లు విచారణలో తేలింది. వెంటిలేషన్ సౌకర్యం మరింత పెంచాలని ఆదేశించాం. ప్రమాదాల నియంత్రణకు పకడ్బీందీ చర్యలు తీసుకుంటున్నాం.
– లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1

గాలిలేదు.. ఊపిరాడదు