
బనకచర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేదిలేదు
● రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి పెద్దపల్లి: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబురాల సభ నిర్వహించారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, నీటి వాటా విషయంలో రాజీ లేదన్నారు. గోదావరి నదీజలాల్లో తెలంగాణ హక్కుగా రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రనీటివాటా విషయంలో కేంద్రప్రభుత్వంతో అన్నిప్రయత్నాలు చేస్తామని తెలిపారు. గోదావరి జలాల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేసినా ఏదోరకంగా బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనేఉన్నారని మండిపడ్డారు. అతిసమీపంలోని మంథని, పెద్దపల్లి పట్టణం, రామగుండం నగరానికి నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆయన దుయ్యబట్టారు. కూలిపోయిన డ్యామ్‌ల గురించి బీఆర్‌ఎస్ నేతలు ఇవాళ గొప్పగా మాట్లాడుతుఉన్నారని, బనకచర్ల విషయంలో ఆనాడులేని ఆరాటం ఇవాళ వచ్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటిశ్వరులను చేయడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ ఉరఫ్ సీతక్క తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ఆర్థికతోడ్పాటు అందిస్తోందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేసే ప్రతీపథాకాన్ని మహిళల పేరు మీదనే అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.