
ఏపీకే ఫైల్ లింక్‌తో రూ.46వేలు మాయం
● పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తెలిసిన వ్యక్తి పంపిన మెసేజ్ కదా.. అని ఏపీకే ఫైల్ లింక్ క్లిక్ చేయగా బ్యాంక్ ఖాతా ఖాళీ కావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన పెరుమాండ్ల అంజయ్య తెలిపిన వివరాలు. ఈనెల 13న సాయంత్రం తనకు పరిచయం ఉన్న వ్యక్తి మొబైల్ నుంచి తమ సంఘం గ్రూప్‌లో పీఎం కిసాన్ పేరిట ఏపీకే లింక్ రాగా.. ఓపెన్ చేశాడు. 14వ తేదీ రాత్రి 2 నుంచి 3.30 గంటల వరకు ఖాతాలో నుంచి దఫదఫాలుగా రూ.46వేలు కాజేశారు. వెంటనే 1930కి కాల్ చేశాడు. అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన న్యాలకంటి సతీశ్ ఖాతా నుంచి గతేడాది డిసెంబర్ 9న సైబర్ నేరగాళ్లు రూ.96వేలు కాజేశారు.
తిరుపతికి మరో ప్రత్యేక రైలు
● నాందేడ్ వయా కరీంనగర్ మీదుగా
● ఆగస్టు 2న ప్రారంభం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఆగస్టు2 నుంచి 31 వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్ నుంచి తిరుపతికి ఒక రెగ్యులర్ రైలుతోపాటు మరో ప్రత్యేక రైలు నడుస్తోంది. సోమ, గురు, ఆదివారం ఈ రైళ్లు కరీంనగర్ నుంచి తిరుపతికి నడుస్తుండగా కొత్త రైలు ప్రతి శనివారం నాందేడ్ నుంచి కరీంనగర్ మీదుగా వెళ్తుంది. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి కరీంనగర్ మీదుగా నాందేడ్‌కు వెళ్తుంది. ప్రతి శనివారం నాందేడ్‌లో సాయంత్రం 4.50గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 11.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదేరోజు రాత్రి 7.45గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి సోమవారం ఉదయం 9.08గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది. ప్రత్యేక రైలును ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ భానుచందర్ కోరారు.

ఏపీకే ఫైల్ లింక్‌తో రూ.46వేలు మాయం