
సమ్మెతో కేంద్రం మెడలు వంచాలి
● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య
గోదావరిఖని: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు నిచ్చారు. సోమవారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా సవరించిందన్నారు. ఒక్కరోజు సమ్మెతో కేంద్రం దిగిరాకపోతే కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు సదానందం, మెండె శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, మడ్డి ఎల్లాగౌడ్, అరెల్లి పోశం, ఎంఏ గౌస్, నాయిని శంకర్, యాస శ్రీనివాస్, నరేష్, సంపత్, జాన్ కెనడి, సతీశ్, రాజమౌళి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.