
రేపు సింగరేణిలో టోకెన్ సమ్మె
● సమ్మెతో సంస్థకు నష్టమంటున్న యాజమాన్యం ● కాదు.. హక్కులు సాధ్యమంటున్న కార్మిక సంఘాలు ● గనులపై కార్మిక సంఘాల విస్తృత ప్రచారం ● సమ్మెకు దూరంగా బీఎంఎస్
గోదావరిఖని: సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న ఒక్కరోజు టోకెన్ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాల జేఏసీ, విప్లవకార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం చేయాలంటూ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ సమ్మె ఆవశ్యకతను కార్మికులకు వివరిస్తున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ, జాతీయ సంఘాలు సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, గతంలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ తదితర సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. బీజేపీకి అనుబంధంగా ఉన్న బీఎంఎస్ మాత్రం సమ్మెకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. బొగ్గు గనుల్లో 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్‌లను కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిద్వారా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బొగ్గు గనుల్లో వెలికితీత పనులు పర్మినెంట్ కార్మికులతో చేయించాలని, ప్రైవేటు కార్మికుల ప్రమేయం ఉండొద్దని, ఉంటే పర్మినెంట్ కార్మిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20నే టోకెన్ సమ్మె చేపట్టాలని నిర్ణయించినా పాకిస్తాన్‌తో యుద్ధం మూలంగా వాయిదా వేశాయి. తిరిగి ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చి.. విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కోల్‌బ్లాక్‌ల వేలంలో సత్తుపల్లి ఓసీపీ ప్రైవేట్ సంస్థకు అప్పగించగా ఓసీపీ ఓబీ మట్టిపోయడానికి స్థలం లేదంటోంది. తాడిచర్ల–2, వెంకటాపూర్ గనులు సింగరేణికే అప్పగించి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని కోరుతున్నాయి.
సమ్మెతో సింగరేణికి నష్టం..
టోకెన్ సమ్మెతో సింగరేణికి నష్టం వాటిల్లుతుందని, కార్మికులు వేతనాలు నష్టపోతారని యాజమాన్యం అంటోంది. సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని, సమ్మె డిమాండ్లలో అత్యధికం సంస్థకు సంబంధించినవి కావని, వాటిని తీర్చేటివి కూడా కాదని చెబుతోంది. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతలో వెనకబడి ఉన్నామని, జూలై, ఆగస్టులో వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరా యం కలుగుతుందని పేర్కొంటోంది. ఒక్కరోజు స మ్మె చేస్తే రూ.76కోట్ల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుందని చెబుతోంది. కార్మికులు వేతనం రూపంలో రూ.13.07కోట్లు నష్టపోతారని, 1.92 లక్షల ట న్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని అంటోంది.