
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
పాలకుర్తి(రామగుండం): పుట్నూర్ గ్రామంలో టా టామ్యాజిక్ ఆటో ఢీకొని శ్రీరాముల మల్లయ్య(60) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన టాటామ్యాజిక్ వాహనం బసంత్‌నగర్ వైపు వస్తుండగా మార్గమధ్యంలో పుట్నూర్ గ్రామశివారులోని గాంధీనగర్ వద్ద రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మల్లయ్యను వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలు కాగా వెంటనే పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని సుల్తానాబాద్‌లో మల్లయ్య మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు బసంత్‌నగర్ పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎల్లారెడ్డిపేటలో గుర్తుతెలియని మహిళ..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటా పూర్ శివారులో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను స్కూటీ బలంగా ఢీకొట్టడంతో మృతిచెందింది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు.. వెంకటాపూర్‌లోని సిరిసిల్ల–కామారెడ్డి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు వెళ్లున్న స్కూటీ శుక్రవారం రాత్రి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహిళను అదే గ్రామానికి చెందిన వాటర్‌పంపు మెకానిక్ మల్లాపురం వెంకటేశ్, అతని స్నేహితుడు మేకల మల్లయ్య సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆ మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై వెంకటేశ్, మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ వివరించారు.
బైక్ ఢీకొని వృద్ధుడు..
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో నర్ర బుచ్చయ్య(60) అనే వృద్ధుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అతివేగంగా వెళ్తూ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న వృద్ధుడు బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లగా మృతిచెందాడు. మృతికి కారణమైన పీసీ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి