
మచ్చలేని నాయకుడిపై నిందలా?
పెద్దపల్లిరూరల్: మచ్చలేని నాయకుడిగా, నీతి, నిజాయతీతో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కుటుంబం నిందలు వేయడం మానుకోవాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హితువు పలికారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరస్వతీ పుష్కరాల ప్రచారంలో ఫ్లెక్సీపై ఎంపీ వంశీకృష్ణ ఫొటో ఏర్పాటు చేయలేదని శ్రీధర్‌బాబుపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. 30 ఏళ్ల యువకుడికి ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించిన నాయకుడిని ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు. వివేక్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని, ఇప్పటికైనా కుల రాజకీయాలు మానుకోవాలని ఆయన హితువు పలికారు. వివేక్ పార్టీలు మారడంలో దిట్ట అని, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఎక్కడ కలిశావో తనకు తెలుసుని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఇష్టం ఉంటే పార్టీ కోసం పనిచేయాలని, లేకుంటే తనకు నచ్చిన పార్టీలోకి వెళ్లాలని సూచించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మల్యాల తిరుపతి, మంథని సత్యం, కర్ణ కృష్ణ, తోకల మల్లేశ్, ఇరుగురాల మహేందర్, బూడిద శంకర్, అక్కపాక సంపత్, సాట్ల అమరజ్యోతి, పులిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్దేశపూర్వకంగానే మంత్రి శ్రీధర్‌బాబుపై అక్కసు
ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శ