
జిల్లాకు భారీ వర్షసూచన
పెద్దపల్లిరూరల్: రానున్న నాలుగు రోజుల్లో జిల్లా లో అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశముందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, అధికారులు అప్రమ త్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ సూచనల మేరకు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో జిల్లాలో ఈనెల 27వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలు వర్షానికి తడవకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
● మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి
● సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి ఇ.నరేశ్
గోదావరిఖని: ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇ.నరేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో దాగివున్న నిజాలతో అన్నికోణాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పహల్గాం హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. ఈనెల 25న గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు ఐ.కృష్ణ, ఐ.రాజేశం, గుండేటి మల్లేశం, రామకృష్ణ, ఎం.దుర్గయ్య, ఎస్.రాజన్న, కాంపెల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.