
విజిలెన్స్ స్లో!
● శాతవాహన సిబ్బందికి మరోసారి నోటీసులు ● ఖర్చు బాధ్యులకు తాజాగా తాఖీదులు ఇవ్వనున్న విజిలెన్స్ ● గతంలో నోటీసులకు పెద్దగా స్పందించని వర్సిటీ అధికారులు ● వీసీ, సిబ్బంది మారడంతో తొలి నుంచి విచారణ ● విచారణకు ఆటంకంగా మారిన విజిలెన్స్‌లో సిబ్బంది కొరత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ గతేడాది మొదలైన విజిలెన్స్ విచారణ నత్తనడకన సాగుతోంది. ఇటీవల యూనివర్సిటీ వీసీ మారడం, కొందరు సిబ్బంది బదిలీ కావడం, పదవీ విరమణ పొందడం అదే సమయంలో విజిలెన్స్‌కు కూడా కొత్త ఎస్పీ రావడంతో విచారణ తిరిగి మొదటి నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. వాస్తవానికి శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనులపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ నిధులను మంచినీళ్లలా ఖర్చు చేశారని పలువురు ఫ్రొఫెసర్లు బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ 18వ తేదీన హైదరాబాద్‌లోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెలరోజుల తరువాత ఈ ఫిర్యాదు కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయానికి చేరింది. దాదాపు 160 పేజీలు ఉన్న ఆ ఫిర్యాదును అధ్యయనం చేసిన జిల్లా విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినా అనుకున్న మేరకు అది సాగలేదు. వర్సిటీ అధికారులు సహకరించకపోవడం ప్రధాన కారణం అయితే, విజిలెన్స్‌లో స్టాఫ్ కొరత మరో ముఖ్య కారణంగా తెలుస్తోంది.
మళ్లీ నోటీసులు
దాదాపుగా ఏడాది కావొస్తున్నా.. విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడంతో దీనిపై మరోసారి విజిలెన్స్ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో వర్సిటీలో జరిగిన అధిక ఖర్చులపై విజిలెన్స్ చిట్టా రూపొందించింది. ముఖ్యంగా వర్సిటీ భవనాల్లో భారీగా (రూ.50 కోట్లకుపైగా) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ సమయంలో ఎవరు ఆ నిర్మాణాలకు బాధ్యలుగా ఉన్నారో గుర్తించారు. ఈ నిర్మాణాల్లోనే చాలా మట్టుకు టెండర్లలో గోల్‌మాల్ జరిగిందన్న విమర్శలున్నాయి. వారికి తిరిగి కొత్తగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తగా వచ్చిన వీసీకి కూడా జరిగిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు వివరించి విచారణకు సహకరించాలని కోరారు. అదే సమయంలో విజిలెన్స్ ఎస్పీగా ఎం.శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టడంతో ఆయనకూ వివరించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది
కొరత
వాస్తవానికి విజిలెన్స్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ కోసం డీటీపీ ఆపరేటర్లనూ రిక్రూట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇన్‌స్పెక్టర్ ర్యాంకుల్లో ఉన్న అధికారులే విచారణతోపాటు కేసు వివరాలను స్వయంగా డీటీపీ చేసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి కరీంనగర్‌లో గతంలో గొర్రెల స్కాం, పత్తి స్కాం, ఆసరా పింఛన్ల స్కాం, సదరం సర్టిఫికెట్ల స్కాం, బల్దియాలో పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో అనేక కేసులు పరిమితి సిబ్బందితో విచారణ చేయాలంటే వీరికి తలకుమించిన భారంగా మారింది. పైగా పని ఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శాతవాహన వర్సిటీ అధికారులు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

విజిలెన్స్ స్లో!