
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: పంటలకు అవసరమైన విత్తనాల కోసం వచ్చే రైతులకు నకిలీ, కల్తీ విత్తనాలను అంటగట్టేందుకు యత్నించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అవినాష్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం విత్తన డీలర్లకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ కరుణాకర్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని, డీలర్లు సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో కనీసం 10 వేల క్వింటాళ్ల ప్రభుత్వ రంగ విత్తనాలు విక్రయించాలని ఆయన సూచించారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఎరువుల కొరత ఉందంటూ దుష్ప్రచారం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, డీలర్లు స్టాక్ వివరాలను ఎప్పటికపుడు అప్‌డేట్ చేయాలన్నారు. సాగును రైతులు ముందస్తుగా చేపట్టాలని ఆయన సూచించారు. విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, వ్యవసాయాధికారులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.