
ఉత్తమ ర్యాంక్ వచ్చేనా
● స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల ప్రకటనపై ఉత్కంఠ ● రామగుండం బల్దియాలో ఇప్పటికే పూర్తయిన క్యూసీఐ బృందం పరిశీలన
కోల్‌సిటీ(రామగుండం): కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని ప ట్టణాలు, నగరాలు, మహానగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం కోసం ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక క్యూసీఐ బృందం పోటీ చేస్తున్న పట్టణాలు, నగరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆన్‌లైన్‌లో మార్కులు వేస్తా రు. ఈ మార్కుల ఆధారంగానే దేశంలోని మున్సి పాలిటీలకు కేంద్రం స్వచ్ఛత ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా బల్దియా కూడా ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2024’ పోటీలో నిలబడింది. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన క్యూ సీఐ బృందం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో రామగుండంలో స్వచ్ఛతపై పరిశీలన పూర్తి చేశారు. రామగుండంకు ఈసారి మెరుగైన ర్యాంక్ వస్తుందనే ఆశతో అధికారులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కా గా, త్వరలోనే స్వచ్ఛత ర్యాంకులను ప్రకటించడాని కి కేంద్రం జాబితాను రూపొందిస్తుందని సమాచారం.
ఓడీఎఫ్ ప్లస్ ప్లస్..
రామగుండం నగరపాలక సంస్థకు ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మలవిసర్జన రహితం) గుర్తింపు మాత్రమే ఉంది. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు కోసం ఇటీవల కేంద్రానికి బల్దియా అధికారులు దరఖాస్తు చేశారు. రామగుండంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) పూర్తయినా వినియోగంలోకి రాలేదు. అయితే స్థానిక మల్కాపూర్ శివారులో నిర్మించిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం– ఎఫ్‌ఎస్‌టీపీ) వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ గుర్తింపు వస్తుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
మొక్కుబడిగా తడి, పొడి..
రామగుండం బల్దియాలో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం మొక్కుబడిగా సాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియ కూడా నామమాత్రంగా జరుగుతోంది. కాగా, పారిశుధ్యాన్ని గాడిలో పెట్టడానికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తోపాటు బల్దియా స్పెషలాఫీసర్‌గా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతోనైనా రామగుండంకు మంచి ర్యాంకు వస్తుందా అనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది.
కార్పొరేషన్ ప్రొఫైల్..
మొత్తం డివిజన్లు: 50
విస్తీర్ణం: 93.87 చదరపు కిలోమీటర్లు
జనాభా(2011 లెక్కల ప్రకారం) : 2,29,644
మురికివాడలు: 71
అసెస్‌మెంట్ల ప్రకారం గృహాలు: 50,956
శానిటేషన్ కార్మికులు: 448
రోజూ వెలువడే చెత్త: 120 మెట్రిక్ టన్నులు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వచ్చిన ర్యాంక్‌లు
ఏడాది ర్యాంకు
2023 175
2022 136
2021 92
2020 211
2019 192
2018 194
2017 191