ఫిట్‌నెస్‌ బాహుబలి | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ బాహుబలి

May 7 2025 12:04 AM | Updated on May 7 2025 12:04 AM

ఫిట్‌

ఫిట్‌నెస్‌ బాహుబలి

● వాహనాల ఫిట్‌నెస్‌ ఇక పక్కా.. ● అందుబాటులోకి ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ● ఏఎఫ్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో సామర్థ్య పరీక్షలు ● త్వరలో రూ.8 కోట్ల యంత్రసముదాయం ఇన్‌స్టాలేషన్‌ ● కేంద్రం ఆదేశాలతో తిమ్మాపూర్‌ ఆర్టీఏ కార్యాలయంలో నిర్మాణం ● ఫిట్‌నెస్‌ వివరాలు నేరుగా ‘వాహన్‌’ పోర్టల్‌తో అనుసంధానం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

కప్పుడు వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఏదోలా నెట్టుకొచ్చేవారు. ఇందులో అక్రమాలకు పుష్కలంగా ఆస్కారం ఉండేది. ఫలితంగా ఫిట్‌నెస్‌లేని వాహనాలు రోడ్ల మీద అమాయకులను బలిగొన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై అలాంటి రోడ్డు ప్రమాదాలేవీ జరగకుండా రోడ్డు భద్రతలో భాగంగా.. ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) అనే భారీ యంత్ర సముదాయాన్ని ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో త్వరలో ఇన్‌స్టాల్‌ చేయనున్న ఈ యంత్ర సముదాయం.. ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పనిచేయనుండటం గమనార్హం. ఈ యంత్రాల ఇన్‌స్టాలేషన్‌ బాధ్యతలను ఆర్‌అండ్‌బీ అధికారులు తీసుకున్నారు. పూర్తి అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఈ భారీ యంత్రాల సముదాయం ఇకపై ఉమ్మడి జిల్లాలోని అన్ని లైట్‌ మోటార్‌ వెహికిల్స్‌ నుంచి భారీ యంత్రాల వరకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయనుంది.

ఏటీఎస్‌ ప్రత్యేకతలు ఏంటంటే..

ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) ఒక యంత్రం కాదు. ఇది వాహనాల ముఖ్యమైన విడిభాగాల సామర్థ్యాన్ని కచ్చితంగా మదించి రిపోర్ట్‌ ఇచ్చే బహుళ యంత్ర సముదాయం. ఎందుకంటే వాహనంలో ఏ భాగం సరిగా పనిచేయకున్నా.. అది ప్రమాదాలకు దారితీస్తుంది. పైగా ప్రస్తుతం మాన్యువల్‌గా జారీ చేసే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లలో అనేక లోపాలు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అలాంటి లోపాలు నివారించేందుకు ఏకరూపకంగా, దోషరహితంగా, పూర్తి కంప్యూటీకరణ చేసిన ఏటీఎస్‌ యంత్రాలతో కచ్చితమైన ఫిట్‌నెస్‌ రిపోర్టు ఇవ్వడం దీని ప్రత్యేకత. హెడ్‌లైట్‌, స్టీరింగ్‌, టైర్‌ కోసం స్లిప్‌టెస్ట్‌, సస్పెన్షన్‌, ఇంజిన్‌, నాయిస్‌, ఎయిర్‌పొల్యుషన్‌.. ఇలా ప్రతీ విడిభాగం పనితీరును పకడ్బందీగా తనిఖీ చేసి ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌) రిపోర్ట్‌ ఇస్తుంది. ఆ వెంటనే.. ఆ రిపోర్ట్‌ను కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ‘వాహన్‌–పరివాహన్‌’ పోర్టల్‌కు చేరవేస్తుంది. ఇలా ప్రతీ బండి సామర్థ్యం, దాని వివరాలు అన్నీ దేశంలో ఎక్కడ నుంచైనా అధికారులు చూసే వీలుంటుంది. ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలోని జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలోని గ్రానైట్‌, ఇసుక, మైనింగ్‌, బొగ్గు, రైస్‌మిల్లుల కోసం నడిచే భారీ వాహనాలు ఇకపై ఈ యంత్రాలతో ఫిట్‌నెస్‌ తీసుకోవాల్సిందే. పాత వాహనాలకు ఫిట్‌నెస్‌ లేకపోతే ఒకటి రెండు సార్లు అవకాశం ఇస్తారు. అయినా మార్పు రాకపోతే ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ జారీ చేసి ఆ వాహనాలను స్క్రాప్‌కు పంపిస్తారు.

రెండెకరాల స్థలంలో..

రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు ఒక ఏటీఎస్‌ యంత్ర సముదాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఈ యంత్ర సముదాయాన్ని ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. ఇది ఉమ్మడి జిల్లా వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందించనుంది. భారీ వాహనాలకు 1500 చదరపు మీటర్ల స్థలం కావాల్సి వస్తుంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని హెవీ, లైట్‌ మోటార్‌ వెహికిల్స్‌ను బట్టి.. ఇక్కడ నాలుగు లేన్లు అవసరమవుతాయని ఇందుకోసం ఎకరంన్నర నుంచి రెండెకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ షెడ్లు, వచ్చే వాహనాల పార్కింగ్‌, డ్రైవర్ల కోసం వెయిటింగ్‌ రూం, సీటింగ్‌ ఏర్పాటు, టాయిలెట్లు, జనరేటర్లు తదితరాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రాల ఇన్‌స్టాలేషన్‌, షెడ్‌ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన అంతా కేంద్రం మార్గదర్శకాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేయనుంది.

15ఏళ్లు నిండిన వాహనాల వివరాలు

జిల్లా వాహనాలు

కరీంనగర్‌ 1,58,129

జగిత్యాల 4,283

పెద్దపల్లి 9,660

రాజన్నసిరిసిల్ల 2,039

మొత్తం 1,74,111

నోట్‌: ఆటోరిక్షా, కాంట్రాక్ట్‌ క్యారేజ్‌, విద్యాసంస్థల బస్సులు, గూడ్స్‌క్యారేజ్‌, మ్యాక్సీ క్యాబ్‌, మోటర్‌ క్యాబ్‌, కారు, ద్విచక్రవాహనం, ప్రైవేట్‌ సర్వీస్‌ వెహికిల్‌, స్టేజీ క్యారేజ్‌, ట్రాక్టర్‌, ట్రైలర్‌తో కలిపి.

ఫిట్‌నెస్‌ బాహుబలి1
1/3

ఫిట్‌నెస్‌ బాహుబలి

ఫిట్‌నెస్‌ బాహుబలి2
2/3

ఫిట్‌నెస్‌ బాహుబలి

ఫిట్‌నెస్‌ బాహుబలి3
3/3

ఫిట్‌నెస్‌ బాహుబలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement