
పే స్కేల్ కోసం పోరుబాట
● మూడు నెలలుగా అందని వేతనాలు
● ఇబ్బందుల్లో ఉపాధిహామీ సిబ్బంది
● దశల వారీగా పోరాటాలకు కార్యాచరణ : జేఏసీ నేతలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధిహామీ సిబ్బంది పే స్కేల్ సాధన కోసం పోరుబాట ఎంచుకున్నారు. ఇందుకోసం దశలవారీగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. గతనెల 29న అధికారులకు వినతిపత్రాలు అందిస్తూ వస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు.. శనివారం ఏకంగా మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులకూ విన్నవించేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఈనెల 5న ప్రజాభవన్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రణాళిక రూపొందించారు. పే స్కేల్, ఉద్యోగ భద్రత లేక ఈజీఎస్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. మూడు నెలలుగా ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లకు వేతనాలు కూడా విడుదల కావడంలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలల నుంచి జీతాలు రాక వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పనుల పర్యవేక్షణలో కీలకం..
ఈజీఎస్ ద్వారా చేపట్టే పనుల్లో సిబ్బంది కృషి కీలకంగా ఉంది. ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణం, భూ అభివృద్ధి పనులు, తెలంగాణకు హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, మల్టీ లెవెల్ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు.. ఇలా అనేక పనులను ఈజీఎస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఈజీఎస్‌లో ఫీల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లకు, హెచ్‌ఆర్ మేనేజర్లు, డీబీటీలు ఇలా.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.
అద్దెకు కూడా ఇబ్బందులే..
ఈజీఎస్ సిబ్బందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని పేదలే అధికంగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తేనే వీరికి వేతనాలు అందుతాయి. అయితే, చాలీచాలని వేతనాలతో సిబ్బంది తమ పిల్లలకు స్కూల్ ఫీజు చెల్లించలేకపోతున్నారు. వంటసామగ్రి, ఇంటి అద్దె, పాలబిల్లులు, ఈఎంఐలు చెల్లించలేక అవస్థ పడుతున్నారు. అదేవిధంగా కార్యాలయాలకు వెళ్లడానికి వాహనాలకు పెట్రోల్, ఆటో, బస్సుచార్జీలు కూడా ఉండడం లేదంటున్నారు. మరోవైపు.. గ్రామీణాభివృద్ధి(సెర్ప్)శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ఈజీఎస్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ఈజీఎస్ సిబ్బంది ఇలా
ఏపీఎంలు 11
జేఈలు/ఈసీలు 09
కంప్యూటర్ ఆపరేటర్లు 19
ఫీల్డ్ అసిస్టెంట్లు 250