యంగ్‌ ఇండియా ‘గ్రీన్‌’ గురుకులాలు | - | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా ‘గ్రీన్‌’ గురుకులాలు

Apr 6 2025 1:59 AM | Updated on Apr 6 2025 1:59 AM

యంగ్‌ ఇండియా ‘గ్రీన్‌’ గురుకులాలు

యంగ్‌ ఇండియా ‘గ్రీన్‌’ గురుకులాలు

● మంథని, హుస్నాబాద్‌లో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ● సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు ● తొలుత ఒక్కో స్కూల్‌కు రూ.145 కోట్లు వెచ్చించనున్న సర్కారు ● త్వరలో పెద్దపల్లి, రామగుండంలోనూ అందుబాటులోకి ● మంథని మండలం సోమనపల్లిలో 25 ఎకరాలు కేటాయింపు ● డిజిటల్‌ బోధన, క్రీడా, ఇతర ఆధునిక సదుపాయాలు ● వచ్చే ఏడాది దసరాకు విద్యార్థులకు అందుబాటులోకి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ (సమీకృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. అందులో తొలిదశలో ఒక్కో పాఠశాలకు రూ.145 కోట్ల చొప్పున వెచ్చించి అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం శనివారం తొలిఅడుగు వేసింది. తొలిదశలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గరుకులాలను నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి నిర్మాణం వేగవంతం చేయనున్నారు. ఈ విద్యాలయాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేలా గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్లను సైతం ఏర్పాటు చేయబోతుండటం విశేషం. సోలార్‌ ఫలకల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు చేపడతారు.

వచ్చే ఏడాది దసరాకు ప్రారంభం

ఈ రెండు స్కూళ్లను రూ.145 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు పూర్తి కాగానే మంథని, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలవనుంది. ఇప్పటికే మంథని నియోజకవర్గంలోని సోమనపల్లి వద్ద ప్రభుత్వం 25 ఎకరాల చొప్పున కేటాయించగా.. మంత్రి శ్రీధర్‌బాబు ఈ సమీకృత గురుకులాలకు ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. త్వరలో నిర్మాణాలు ప్రారంభించి.. వచ్చే ఏడాది దసరాకు భవనాల నిర్మాణం పూర్తి చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. ప్రతీ స్కూల్‌ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకుపైగా నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించనుండటం గమనార్హం.

ప్రత్యేకతలు ఇవే..

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ విద్యాలయాలను 25 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తారు.

4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన చేస్తారు.

తరగతి గదులలో డిజిటల్‌ స్మార్ట్‌ బోర్డ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ ఉంటాయి.

క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, టెన్నిస్‌ క్రీడల కోసం మైదానం, సౌకర్యాలు కల్పిస్తారు.

ప్రతీ స్కూల్‌లో 2500 పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధన

సొంత సోలార్‌ విద్యుత్‌తో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్‌రూమ్‌ ఉపకరాణల నిర్వహణ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement