
షెడ్లు శిథిలం
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
కియాస్కీల సమాచారం
తొలిదశలో షెడ్లు 50
మంజూరైన నిధులు(రూ.లక్షల్లో) 33
టెండరు నిర్వహణ డిసెంబరు – 2020
రెండోదశలోని షెడ్లు 50
మంజూరైన నిధులు(రూ.లక్షల్లో) 40
కౌన్సిల్ ఆమోదం తెలిపింది జనవరి – 2021
ఇప్పటివరకు నిర్మించిన షెడ్లు 37
గుర్తించిన వీధివ్యాపారులు 24,497
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారులు(స్ట్రీట్ వెండర్స్) అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారులు నాలుగేళ్ల క్రితం రూ.లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా షెడ్లు(కియాస్కీలు) నిర్మించారు. కానీ, వాటిని ఎవరికీ కేటాయించకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. వినియోగానికి ముందే శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు ధ్వంసం కావడంతో వర్షాకాలంలో ఉరుస్తోంది. దీంతో చుట్టుపక్కల ఏర్పాటు చేసిన షీట్లు తడిచి పెచ్చులు ఊడుతున్నాయి. షెడ్లకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. స్ట్రీట్ వెండర్స్‌ను ఆర్థికంగా బలోపేతం చేస్తామనే సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు.
15 ఏళ్ల క్రితమే మార్గదర్శకాలు
వీధి వ్యాపారుల అభివృద్ధి, సంక్షేమం కోసం కియాస్కీ షెడ్ల నిర్మాణానికి 2010లోనే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వాటిని అమలు చేయడంలో అప్పటి పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో అవి అమలుకు నోచుకోవడంలేదు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీవ్రతరం కావడంతో 2019లో వీధి వ్యాపారుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన రామగుండం బల్దియా అధికారులు.. ఎట్టకేలకు సర్వే చేపట్టారు.
24,497 మంది స్ట్రీట్ వెండర్స్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24,497 మంది స్ట్రీట్‌వెండర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 24,355 మంది రూ.10 వేల పీఎం స్వనిధి రుణం పొందారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన వా రు.. దశలవారీగా మరోసారి పీఎం స్వనిధి రుణా లు తీసుకున్నారు. వీరందరికీ రహదారులపై కాకుండా నిర్దిష్ట స్థలంలో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా కియాస్కీ షెడ్లు నిర్మించారు. కానీ, వాటిని కేటాయించడంలో ఉన్నతాధికారులు చేతులెత్తేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నాలుగేళ్ల క్రితం 37 షెడ్ల నిర్మాణం
2019 సెప్టెంబర్‌లో రూ.30 లక్షలు వెచ్చించి 50, 2021 జనవరిలో మరో రూ.40 లక్షల వ్యయంతో ఇంకో 50 షెడ్లు నిర్మించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో తొలివిడతలో గోదావరిఖని కూరగాయల మార్కెట్‌లో ఆరు, గౌతమినగర్‌లో ఆరు, గోదావరి నదీతీరంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంతంలో 10, ఎన్టీపీసీలోని ఎఫ్‌సీఐ ఎక్స్ రోడ్డులో 15 షెడ్లు నిర్మించారు. మిగతావి నిర్మించడానికి అనువైన స్థలం అందుబాటులో లేదనే సాకుతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
నగరంలో మెప్మా సిబ్బంది సర్వే..
షెడ్ల కేటాయింపు కోసం నగరపాలక కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశాలతో మెప్మా ఆర్పీలు, సీవో లు ఇటీవల సర్వే చేపట్టారు. ఎఫ్‌సీఐ ఎక్స్ రోడ్డు లోని 15 షెడ్లతోపాటు గౌతమినగర్‌లోని షెడ్ల కేటాయింపులకు ఆసక్తి ఉన్న స్ట్రీట్‌వెండర్స్ నుంచి దర ఖాస్తులు స్వీకరించారు. షెడ్లలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అంచనాల కోసం ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు బల్దియా కమిషనర్ లేఖ రాశారు. ఇప్పటివరకు ఇటు బల్దియా నుంచి, అటు విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలంకారప్రాయంగా మారిన కియాస్కీలపై ‘సాక్షి’ ఆరా తీయడంతో స్పందించిన బల్దియా కమిషనర్.. మరోసారి స్ట్రీట్‌వెండర్స్ కోసం రీ సర్వే చేపట్టాలని బుధవారం ఆదేశించినట్లు సమాచారం.
న్యూస్‌రీల్
నాలుగేళ్ల క్రితం ‘కియాస్కీ’ల నిర్మాణం
వీధివ్యాపారులకు కేటాయించని వైనం
నిరుపయోగంగా మారిన 37 షెడ్లు
చర్యలు తీసుకుంటున్నాం
కియాస్కీ షెడ్ల కేటాయింపులపై ఇప్పటికే సర్వే చేశాం. మరోసారి సర్వే చేయిస్తాం. షెడ్ల సమీపంలోని స్ట్రీట్‌వెండర్స్‌కే వాటిని కేటాయిస్తాం. షెడ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి సంబంధిత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరుతూ లేఖ కూడా రాశాం. ఈ విషయంపై మరోసారి అధికారులతో చర్చిస్తాం.
– అరుణశ్రీ,
బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ), రామగుండం

షెడ్లు శిథిలం

షెడ్లు శిథిలం

షెడ్లు శిథిలం

షెడ్లు శిథిలం

షెడ్లు శిథిలం

షెడ్లు శిథిలం