గంగాధర(చొప్పదండి): కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు. పెళ్లికెదిగిన ఆడబిడ్డ భారమవుతుందని తల్లిదండ్రుల ఆవేదనలు. ఊరంతా చందాలు వేసుకొని ఓ ఆడబిడ్డ పెళ్ల్లి చేసిన సంఘటన.. ఓ యువకుడిని ఆలోచింపజేశాయి. మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు కు పునాది వేశాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయిపల్లికి చెందిన రేండ్ల శ్రీనివాస్–పద్మ దంపతులు తమ గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు ఏడేళ్ల క్రితం మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడ బిడ్డ పేరుమీద ఫౌండేషన్ తరఫున రూ.5,116, తల్లిదండ్రుల నుంచి రూ.5,000 సేకరించి సుకన్య సమృద్ధి యోజనలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు 54 మంది ఆడపిల్లల పేరిట డిపాజిట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తండ్రిని కోల్పోయిన కుటుంబాలకు దాతల సహకారంతో ఆర్థికంగా అండగా నిలుస్తున్నా రు. ఏడాదిగా ఆడపిల్లల పెళ్లికి కానుకలు అందిస్తున్నారు.