సప్తగిరికాలనీ(కరీంనగర్): రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థలపై ప్రత్యక్ష దాడులు తప్పవని, అధికారుల వత్తాసు వల్లే విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో మాట్లాడారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా స్కాలర్‌షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7,650 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు అనేక ఆర్థికపరమైన అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నాయకులు సందీప్‌రెడ్డి, వినయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.