
అమరులకు వందనం
గోదావరిఖని: పోలీసులు, నక్సల్స్‌తోపాటు సంఘవిద్రోహ శక్తుల చేతిలో చనిపోయిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం రామగుండం పోలీసు కమిషనరేట్‌లో సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించేందుకు పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధానంగా దశాబ్దాలు గా సాగుతున్న పోలీసులు, మావోయిస్టుల(ఒకప్పటి పీపుల్స్‌వార్) మధ్య పోరులో అనేకమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లిలో డీ ఎస్పీ, సీఐతోపాటు 11 మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి డీఎస్పీ బుచ్చిరెడ్డిని నక్సలైట్లు హతమార్చారు. అయితే, ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం తమ ప్రాణాల ను పణంగా పెడుతున్న పోలీసులు.. విధి ని ర్వహణలో చనిపోతు న్నారు. ఇలా అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకోవడానికి ఏటా పోలీసుశాఖ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తోంది. ఈక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చనిపోయిన వారి కోసం అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఇంటిపెద్ద దిక్కును కోల్పోయి, గుండె నిబ్బరంతో తమ జీవితాలను వెళ్లదీస్తున్న పోలీసు కుటుంబాల్లో మనోధైర్యం కల్పించేందుకు అమరులకు ఘనంగా నివాళి అర్పించేలా పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
వారి త్యాగాలు చిరస్మరణీయం
మావోయిస్టులతో జరిగే పోరులో అమరులైన పోలీసుల త్యాగాలు అజరామరం. శాంతిభద్రతల పరిరక్షణలో నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నాం.
– శ్రీనివాస్, రామగుండం సీపీ
నేడు పోలీసు అమరుల సంస్మరణ దినం
03–08–1985 : పెద్దపల్లిలో హోంగార్డు ఎర్రోజు స్వామి నక్సల్స్ చేతిలో హతమయ్యారు.
04–03–1996 : పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పేల్చివేతలో కానిస్టేబుల్ షేక్‌దాదే మృతి చెందారు.
24–07–1996 : కానిస్టేబుల్ పి.రాములును మంథని పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్కేపూర్‌లో నక్సలైట్లు కాల్చిచంపారు.
06–11–1986 : పెద్దపల్లి డీఎస్పీ ఎ.బుచ్చిరెడ్డిపై నక్సల్స్ కాల్పులు జరిపి చంపేశారు.
23–05–1999 : మంథని– ముత్తారంలో హోంగార్డు ఎం.శంకరయ్యను నక్సల్స్ హతమార్చారు.
వీరితో పాటు మంచిర్యాల జిల్లాలో సీఐ చక్రపాణి, ఏఎస్సై మదన్‌మోహన్, హెడ్‌కానిస్టేబుళ్లు ఎండీ జహీరుద్దీన్, ఎ.సంజీవరెడ్డి, జి.శేషయ్య, కానిస్టేబుల్ కె.అశోక్ హతమయ్యారు.
వీరి జ్ఞాపకార్ధం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించనున్నారు.

అమరులకు వందనం