ఇం‘ధనం’ ఏది?
● పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ కరువు ● పలు యూనిట్లలో విడుదల కాని రెండో త్రైమాసిక నిధులు ● ఇంధనం కోసం పెట్రోల్ బంకుల్లో పోలీసుల ఉద్దెర ఖాతాలు ● మూడు నెలలుగా సర్దుబాటు చేయలేక ఎంటీవోల తిప్పలు ● రామగుండం, కరీంనగర్ కమిషనరేట్లు, జగిత్యాల, సిరిసిల్ల యూనిట్లలో పరిస్థితి
ఏంటి సమస్య?
బంక్ బాయ్: మా సార్ ఉద్దెరకు డీజిల్ పోయొద్దన్నాడు సార్.. పాత బకాయిలు చానా ఉన్నయ్!
డ్రైవర్: ఈసారికి ఖాతాలో రాసుకోవయ్యా.. బిల్లులు రాగానే ఇచ్చేస్తాం!
బంక్ బాయ్: సార్.. ఇదేమాట రెండు నెలలుగా చెబుతున్నారు. మా సేటు డబ్బులు ఇవ్వకపోతే పోయొద్దన్నాడు. ఇదే ఆఖరు సార్.
డ్రైవర్: సరే సరే నింపవయ్యా.. మాసార్ మీ సేటుతో మాట్లాడుతడు లే.. కోర్టుకు వెళ్లే టైమైంది!
ఇదీ.. ఇటీవల గోదావరిఖనిలో పోలీసు జీపు డ్రైవర్‌కి, పెట్రోల్ బంకు ఉద్యోగి మధ్య జరిగిన సంభాషణ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
అత్యవసర సర్వీసుల్లో ముందుండేది పోలీసుశాఖ. శాంతి భధ్రతల పరిరక్షణే కాదు.. కరోనా లాంటి విపత్తుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. ఏ సమయంలో ఫోన్‌చేసినా.. నిమిషాల్లో ప్రత్యక్షమవుతారు. అలాంటి అత్యవసర సర్వీసు వారికి ఆర్థికంగా ఆపదవచ్చింది. విషయం ఏంటంటే.. పోలీసు సిబ్బంది కొంతకాలంగా వాహనాల్లో ఇంధనానికి డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి కేవలం రామగుండం కమిషనరేట్‌లోనే కాదు, కరీంనగర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసు యూనిట్లకు పెట్రోల్, డీజిల్‌కు డబ్బులు లేక ఉద్దెర ఖాతా పెడుతున్నట్లు సమాచారం. జగిత్యాల యూనిట్‌లో అయితే ఏకంగా దాదాపు ఐదారు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని పలువురు పోలీసు సిబ్బంది వాపోతున్నారు. ప్రతీసారి బంకు ఉద్యోగులకు సర్దిచెప్పడం లేదా సదరు ఎంటీవోలతో ఫోన్లో హామీ ఇప్పించడం తదితర మార్గాల్లో పోలీసుల వాహనాల్లో ఇంధనం సర్దుబాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు యూనిట్లలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిసింది.
ఏం జరిగింది?
నిధులు సకాలంలో అందకపోవడం వల్లే పోలీసుస్టేషన్లతోపాటు, వాహనాలకు ఇంధనం సమస్య తలెత్తింది. ఈసారి ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ పెట్టారు. ఇటీవల పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చింది. అందులో పోలీసుశాఖకు కూడా నిధులు ఇచ్చారు. అయితే, యూనిట్లకు పూర్తిస్థాయిలో చేరలేదని సమాచారం. ప్రతీ యూనిట్‌కి పోలీసుస్టేషన్ల సంఖ్య, వాహనాల సంఖ్య, అవి తిరిగే దూరాన్ని బట్టి బడ్జెట్ నిర్ణయిస్తారు. ఈ నిధులు వార్షిక బడ్జెట్ అనంతరం ప్రతీ త్రైమాసికానికి ఓసారి విడుదల చేస్తారు. ఉదాహరణకు మార్చిలో బడ్జెట్ పెడితే.. ఏప్రిల్, మే, జూన్‌ను మొదటి త్రైమాసికంగా, తర్వాత మూడునెలలను రెండో త్రైమాసికంగా తీసుకుని బిల్లులు విడుదలచేస్తారు. అయితే, యూనిట్లలో ఈ బిల్లుల విడుదల సరిగా లేదని సమాచారం. రామగుండంలో ఐదు నెలలుగా, కరీంనగర్‌లో రెండు నెలలుగా, జగిత్యాలలో ఆరు నెలలుగా, సిరిసిల్లలో నెలరోజులుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయా యూనిట్ల సిబ్బంది తెలిపారు.
వాస్తవానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు ఏటా బడ్జెట్లో కొంత మొత్తం కేటాయిస్తారు. ఈ శాఖలో నిర్వహణకే అధికంగా నిధులు కేటాయిస్తారు. అందులో జీతభత్యాలు, పింఛన్లు, రుణాలు, కార్యాలయాల నిర్వహణ, భవనాల మరమ్మతులు, వాహనాల నిర్వహణ తదితరాల ఉంటాయి. వీటన్నింటిలోనూ వాహన నిర్వహణ చాలాకీలకమైన అంశం. దేశంలోనే ఘటన జరిగిన స్థలానికి కేవలం 9 నిమిషాలలోపు కంటే తక్కువ సమయంలో చేరుకునే ఏకై క డిపార్ట్‌మెంట్ గా తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంటు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. (డయల్ 100కి ఫోన్ వచ్చిన వెంటనే 9 నిమిషాల్లో, గ్రామాల్లో ఈ సమయం మరింత తక్కువగా ఉంటుంది.) ఇందుకోసం నిరంతరం బ్లూకోల్ట్స్, గస్తీ వాహనాలు (పెట్రో కార్స్) తమ పరిధిలో సంచరిస్తుంటాయి. అంతటి కీలకమైన విభాగానికి నిధుల కొరత తలెత్తడంపై సాక్షాత్తూ సిబ్బంది ఆశ్చర్య పోతున్నారు.
ఇం‘ధనం’ ఏది?


