భీకరంగా వీచిన ఈదురుగాలులు
భయంతో పరుగు పెట్టిన జనం
వీరఘట్టం: ఆకాశంలో వచ్చిన భారీ మెరుపు
వీరఘట్టం: జిల్లావ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలుల అనంతరం ఆకాశం ఉరుములు, మెరుపులతో గర్జించడంతో జనం భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో ఆకాశంలో వచ్చిన పెద్ద పెద్ద శబ్దాలకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.అర్జునా..ఫల్గుణా..పార్థా అంటూ జనం స్మరించుకున్నారు.వర్షం కూడా కొద్ది సేపు భారీగా కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.పగలంతా ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు ఈ వాతావరణం ఉపశమనం కలిగించింది.
నేలకొరిగిన భారీ వృక్షం
సీతంపేట: భారీ ఈదురుగాలులు, వర్షానికి స్థానిక పోస్ట్‌మెట్రిక్ గర్‌ల్స్ హాస్టల్ సమీపంలో భారీ వృక్షం శుక్రవారం నేలకూలింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగింది. కొత్తూరు–పాలకొండ వైపు వెళ్లే వాహనాలు కొద్ది సేపు నిలిచిపోయాయి. ఎస్సై వై.అమ్మన్నరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాన్ని తొలగింపు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు.


