@11.465 లక్షల యూనిట్లు | - | Sakshi
Sakshi News home page

@11.465 లక్షల యూనిట్లు

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

@11.465 లక్షల యూనిట్లు

విజయనగరం: కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు అవసరముంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలను ఎక్కువ వినియోగిస్తున్నారు. ఫ్యాన్‌లు, కూలర్‌లకు 24 గంటలూ పనిచెబుతున్నారు.. గడిచిన త నాలుగు రోజులుగా ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవి తీవ్రతకు అనుగుణంగా విద్యుత్‌ అవసరాలు అదే క్రమంలో పెరుగుతున్నాయి. గృహావసరాలు, పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ఆధారిత రంగాల్లో వినియోగంపై ఇప్పటికే ఎక్కువైంది. దీంతో రోజువారీ విద్యుత్తు వాడకం గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం విజయనగరం జిల్లాలో రికార్డ్‌ స్థాయిలో విద్యుత్తు వినియోగం 11 ఎంయూ (11 లక్షల యూనిట్లు)గా నమోదైంది. సాధారణ రోజుల్లో జిల్లాలో 9 ఎంయూ (9 లక్షల యూనిట్లు) వినియోగిస్తుండగా..ప్రస్తుత వేసవిలో అదనంగా మరో 2 లక్షల యూనిట్ల వినియోగం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

గృహ వినియోగమే ఎక్కువ..

ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో విజయనగరం టౌన్‌, విజయనగరం రూరల్‌, బొబ్బిలి డివిజన్‌ల పరిధిలో మరో 9 సబ్‌ డివిజన్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 98 సబ్‌ స్టేషన్‌లు ఉండగా..24,428 డీటీఆర్‌ (డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌)లు, 8,640 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వాటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా 7,19,165 సర్వీసులకు ప్రతి రోజు విద్యుత్‌సరఫరా చేస్తుండగా..వాటిలో గృహావసర విద్యుత్‌సర్వీసులు 6,00,828, వాణిజ్య సర్వీసులు 64,361, పారిశ్రామిక సర్వీసులు 2432, వివిధ రకాల ఇనిస్టిట్యూషన్‌ సర్వీసులు 15,332, వ్యవసాయాధారిత సర్వీసులు మరో 36,215 ఉన్నాయి. వాటిలో గృహవసరాలకే ఎక్కువగా విద్యుత్‌ వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో ఈ కేటగిరి విద్యుత్తు వాడకం ఎక్కువగా పెరిగిందని చెబుతున్నారు. సాధారణంగా కోస్తా ప్రాంతంలో ఉక్కపోత ఎక్కువ. ఉపశమనానికి నగరంలో ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు అత్యధికంగా విద్యుత్తు వినియోగం జరుగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో పరిశీలిస్తే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అధిక విద్యుత్‌ వినియోగం జరుగుతున్నట్లు విద్యుత్‌ శాఖ వెల్లడిస్తోంది.

అప్రకటిత విద్యుత్‌ కోతలతో ఉక్కిరిబిక్కిరి

ఓ వైపు మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు విద్యుత్‌ శాఖ అధికారులు విధిస్తున్న అప్రకటిత విద్యుత్‌ కోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పపగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దాదాపు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అధికారులు విద్యుత్తు కోతలు లేవని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఉదయం, రాత్రివేళల్లో గంటల తరబడి సరఫరా నిలిపివేయడంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు ఏసీలు, కూలర్‌లు కొనుగోలు చేయడం పెరగడం గమనార్హం. రెండు రోజులుగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పలు షోరూంలు కొనుగోలు దారుల సందడితో కళకళలాడుతుండడం విశేషం.

రికార్డుస్థాయిలో రోజువారీ విద్యుత్‌ వినియోగం

సాధారణ రోజుల కంటే 2 లక్షల యూనిట్లు ఎక్కువ

జిల్లా వ్యాప్తంగా 7,19,165 విద్యుత్‌ సర్వీసులు

జోరుగా సాగుతున్న ఏసీలు, కూలర్‌ల కొనుగోళ్లు

డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా

గతంలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్తు డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా ఇస్తున్నాం. ఎక్కడా కోతలు అమలుచేయడం లేదు. ప్రస్తుతం 10.50 ఎంయూ నుంచి 11 ఎంయూ వరకు రోజువారీ విద్యుత్‌ వినియోగం అవుతోంది. పలు ప్రాంతాల్లో ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్‌ల ఫ్యూజులు కాలిపోతే వాటిని ఎప్పటికప్పుడు మార్పు చేస్తున్నాం. అందుకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో తప్ప ఎటువంటి కోతలు విధించడం లేదు.

– మువ్వల లక్ష్మణరావు, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌

Advertisement
 
Advertisement
Advertisement