నిధులున్నా.. ప్రయోజనం సున్నా..! | - | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. ప్రయోజనం సున్నా..!

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

నిధులున్నా.. ప్రయోజనం సున్నా..!

వీరఘట్టం: పై ఫోటో చూశారా.. వీరఘట్టం మండలం తెట్టంగిలో సోమవారం జేసీబీతో రోడ్డు పక్కన ఉన్న పిచ్చిమొక్కలు తొలగించి, పారిశుధ్య పనులు చేపట్టారు. సుమారు రూ.5 వేలు ఖర్చు అయ్యింది. ఈ పంచాయతీలో రూ.4 లక్షలు జనరల్‌ ఫండ్‌, రూ.1.5 లక్షలు 15వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి. ఈ నిధులు తీసేందుకు పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి అధికారం లేకపోవడంతో సొంత డబ్బులు పెట్టి పారిశుధ్య పనులను చేయించారు.

వీరఘట్టం మేజర్‌ పంచాయతీలో నిధులు పుష్కలంగా ఉన్నాయి. జనరల్‌ ఫండ్‌ సుమారు రూ.36 లక్షలు, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.15 లక్షల వరకు ఉన్నాయి. పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని తీసేందుకు అధికారులకు ఎటువంటి డ్రాయింగ్‌ అథారిటీ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గడిచిన రెండు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీయే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ఇటీవల పంచాయతీలకు నియమించిన ప్రత్యేకాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన పడకేస్తోంది. పంచాయతీల్లో పారిశుధ్య పరిరక్షణ, తాగునీటి సరఫరా తదితర పనులు చేపట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇటీవల పంచాయతీలకు కొత్తగా వచ్చిన ప్రత్యేకాధికారులు పాలన ఎలా చేపట్టాలో తెలియక అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య పనులు చేపడుతూ చేతిడబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతి డబ్బు ఖర్చు..

చాలా గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడంతో అక్కడ పనులు చేపట్టేందుకు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలతో మాటలు పడాల్సి వస్తుందని ప్రత్యేకాధికారులు అంటున్నారు. ప్రత్యేకాధికారులకు డ్రాయింగ్‌ పవర్‌ వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇందుకు ముడిపడ్డ సాంకేతిక సమస్యలను క్లియర్‌ చేయాలని వారంతా కోరుతున్నారు.

సమస్య పరిష్కారానికి చర్యలు

జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో నిధులు పుష్కలంగా ఉన్నాయి.వాటిని తీసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏర్పడిన సాంకేతిక సమస్యలను కొద్ది రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం.ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడతాం.

ఎస్‌.రవీంద్ర,జిల్లా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి, పార్వతీపురం మన్యం

Advertisement
 
Advertisement
Advertisement