పూసపాటిరేగ: మండలంలోని కోనాడ పరిధిలో గల బొడ్డుగురయ్యపేటలో జరిగిన కొట్లాటలో శుక్రవారం ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..బొడ్డుగురయ్యపేటకు చెందిన బొడ్డు రాము (61)తో అదే గ్రామానికి చెందిన బొడ్డు అశోక్, బొడ్డు అమ్మోరు, బొడ్డు దానయ్యలకు రస్తా విషయమై గొడవ జరిగింది. రస్తాలో సిమెంట్ గచ్చు పనులు చేయడంతో వద్దు అని రాము వారించగా ఇరుపార్టీల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రస్తాలో సిమెంట్‌తో గచ్చు చేయిస్తున్న అశోక్, అమ్మోరు, దానయ్యలను రాము అడ్డుకోవడంతో వారు ముగ్గురు గుండెలపై గట్టిగా కొట్టడంతో రాము మృతిచెందాడు. ఈనెల 26వతేదీన బొడ్డుగురయ్యపేటలో జరగబోయే గ్రామదేవత పండగ నిమిత్తం రాముతో పాటు గొడవపడిన ముగ్గురు విశాఖ నుంచి వచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లాకేంద్రాస్పత్రికి పోలీసులు తరలించారు. ఫిర్యాదు మేరకు భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గజపతినగరం: బాడంగి మండలం తెంటువలస గ్రామానికి చెందిన కోడి ఆదినారాయణ 2021వ సంవత్సరంలో రాత్రి 8 గంటల సమయంలో విజయనగరం నుంచి స్వగ్రామానికి ఆటో నడుపుకుంటూ వస్తుండగా మార్గమధ్యంలో సాలూరు గ్రామానికి చెందిన రుంకాన శ్రీనివాసరావు లారీతో ఢీకొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో బాధితుడి బంధువు కోడి శంకర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం బూర్జివలస హెడ్‌కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ ఇంతకాలం వైద్యసేవలు పొందిన కోడి ఆదినారాయణ ఇటీవల మృతిచెందాడని కేసుదర్యాప్తు పూర్తయిన తరువాత ముద్దాయి రుంకాన శ్రీనివాసరావుకు కోర్టు శుక్రవారం ఆరునెలలు జైలుశిక్ష విధించినట్లు తెలిపారు.


