పాలకొండ: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపాల్ శ్యామ్‌బాబు అన్నారు. పాలకొండ డిగ్రీ కళాశాలలో బుధవారం రసాయన శాస్త్రంపై అంతర్జాతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల వర్సిటీల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రం ప్రాధాన్యత, ప్రాముఖ్యతను వివరించారు. ఆదికవి నన్నయ్య వర్సిటీ ప్రొఫెషర్ బి.జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం, శక్తి, పర్యావరణ స్థితి స్థాపకత, సుస్థిరతకు రసాయన శాస్త్రం ఎంతగా దోహదపడుతుందని వివరించారు. ఐఐటీ పట్నా ప్రొఫెషర్ టి.రాజగోపాల్, ఐఐటీ తిరుపతి ప్రొఫెషర్ ఎస్.సోమేశ్వరరావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎస్.శర్మ, ఆర్‌కేసీ యమజాల, పాలకొండ కళాశాల అధ్యాపకుడు ఎస్.రామకృష్ణ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.జయమని, అధ్యాపకులు బి.రాజు, ఎం.శాంతి, కె.శ్రీనివాసరావు, పి.రాజ్యలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఎస్.జగన్‌మోహనరావు పాల్గొన్నారు.


