అసంతృప్తిదారులు x తహసీల్దార్లు | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తిదారులు x తహసీల్దార్లు

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. చాలావరకు సమస్యలకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అవినీతి కారణమవుతోంది. ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ వంటివి నిర్వహిస్తున్నా.. ఆ దరఖాస్తులు మళ్లీ మండల కార్యాలయాలకే వెళ్లడం.. యథాస్థితిలో సమస్య ఉండిపోవడం పరిపాటిగా మారింది. ఇందువల్లే అర్జీదారులు పదేపదే అవే వినతులను తిప్పుతున్నారు. ఈ సమస్యను గుర్తించే కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి ప్రత్యేక కార్యక్రమం అమలుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ సమస్యలపై అసంతృప్తి అర్జీదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గతంలో ప్రజావాణి, స్పందన, పీజీఆర్‌ఎస్‌ వేదికల ద్వారా అందిన వినతులపై ఇంకా పరిష్కారం లభించలేదని పేర్కొన్న అర్జీదారులను ప్రత్యేకంగా పిలిపించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆర్‌ఓఆర్‌ నమోదు, వారసత్వ మార్పులు, సరిహద్దు వివాదాలు, ఆక్రమణల తొలగింపు, భూమి రికార్డుల సవరణలు తదితర అంశాలపై సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 50 అర్జీలు అందాయి. ఇవన్నీ గతంలో వచ్చినవే. ఇప్పుటికే వీటిపై పలుమార్లు దరఖాస్తులు అందించారు. తహసీల్దార్ల వద్దే సమస్య పరిష్కారం కావడం లేదని గుర్తించిన కలెక్టర్‌.. అన్ని మండలాల నుంచీ వారిని పిలిపించారు. కలెక్టర్‌ దగ్గరికి వెళ్లేలోపే సంబంధిత అర్జీదారులను ఆయా మండలాల తహసీల్దార్లు అడ్డుకోవడం గమనార్హం. ఇన్నాళ్లూ చేయలేనిది.. ‘రేపు ఉదయం మండల కార్యాలయానికి రండి.. మీ పని అయిపోతుంది.. కాగితం ఇచ్చేస్తాం’ అంటూ పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది చేసేది లేక.. అక్కడి నుంచి వెనుదిరగగా.. మరికొందరు అధికారులపై కోపంతో ఎన్నిసార్లు తిరిగినా తమ పని అవ్వడం లేదని కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి, జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవార్‌ సప్నిల్‌ జగన్నాథ్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలతల వద్ద మొర పెట్టుకున్నారు.

● పాలకొండ పరిధి వాటపాగు గ్రామానికి చెందిన శిల్లా భాస్కరరావుకు చెందిన భూముల్లో కొంతభాగం ఆన్లైన్‌ లో వేరొకరి పేరున చూపిస్తోంది. పత్రాలు పరిశీలించి, రీ సర్వే జరిపి తమ పేరిట వెబ్‌ ల్యాండ్‌లో నమోదు చేయాలని ఇప్పటికే పలు దఫాలు వారు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో కలెక్టర్‌ ఎదుట నేరుగా చెప్పుకుందామని వచ్చారు.

● పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ మడకవానివలసకు చెందిన రాయల రాములు.. తన తండ్రి పేరున పార్వతీపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో క్రమంగా దాఖలు పడిన భూములు ఉన్నాయని, ఇప్పుడు ఆ భూములను వంగపండు భాస్కరరావు, వంగపండు జయమ్మ, సుశీలమ్మ తదితరులు అక్రమంగా ఆక్రమించుకుని దున్నుతున్నారని తెలిపారు. పార్వతీపురం తహసీల్దార్‌, గ్రామ రెవెన్యూ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు.

అసంతృప్తి అర్జీదారులతో కలెక్టర్‌ ముఖాముఖి

అవే సమస్యలు పునరావృతం

అర్జీలు ఇవ్వనీయకుండా అడ్డుపడిన తహసీల్దార్లు!

సాలూరు మండలం కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన అన్నదమ్ములు సీదిరపు శ్రీరాం, శోభన్‌ కుమార్‌ అనే గిరిజనులు తమ తాతల కాలం నుంచి 4.15 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు. భూమి హక్కుకు సంబంధించిన అన్ని కాగితాలూ వారి వద్ద ఉన్నాయి. సుమారు రెండేళ్ల నుంచి ఆ భూమికి వేరొకరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. గతంలో వీరు పలుమార్లు అధికారులను కలిశారు. ఎక్కడా న్యాయం జరగడం లేదని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement